విశాఖ సిటీ: విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా తమ విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే అవకాశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఏపీఈపీడీసీఎల్ ప్రత్యేక వెబినార్ నిర్వహించనుంది. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారుల కోసం ‘ఎనర్జీ అండ్ కాస్ట్ సేవింగ్స్–డిమాండ్ రెస్పాన్స్’ అనే అంశంపై ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్ వెబినార్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ ఆదేశాల మేరకు మద్రాస్ ఐఐటీకి చెందిన ఎనర్జీ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ ఎలిమెంట్స్ ఎనర్జీ భాగస్వామ్యంతో కమర్షియల్ విభాగం అధికారులు ఈ వెబినార్ నిర్వహించనున్నారు. ఇందులో డిమాండ్ రెస్పాన్స్ విధానం, టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానంపై వినియోగదారులకు అవగాహన కల్పించనున్నారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులు ఇందులో పాల్గొనాలని సంస్థ ఆహ్వానించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యుత్ వినియోగాన్ని మెరుగుపరిచి.. పరిశ్రమ, వాణిజ్య విభాగాల్లోని ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వినియోగదారులకు మొత్తంగా రూ.10 లక్షల ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఏపీఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ (కమర్షియల్) ఎస్.రాజబాబు, లేదా ఎలిమెంట్స్ ఎనర్జీ ఫౌండర్ ఆన్సన్ సాండో 9445613791 ఫోన్ నంబర్ లేదా support@elementsenergies. com ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.


