కొమ్మాది: కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినందుకు గాను భీమిలి బీచ్ రోడ్డులోని ‘విరాగో పబ్’, తొట్లకొండ సమీపంలోని ‘శాంక్టమ్ బీచ్ రిసార్టు’లను జీవీఎంసీ అధికారులు సోమవారం సీజ్ చేశారు. హైకోర్టు ఆదేశాలు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచనల మేరకు డీసీపీలు హరిదాస్, వెంకటేశ్వరరావు, ఏసీపీలు రామకృష్ణ, శాస్త్రి నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. తీర ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి ముందుగా అనుమతులు పొందాలి. అయితే ఈ రెండు రిసార్టుల యాజమాన్యాలు ఎటువంటి ఎన్‌వోసీ, జీవీఎంసీ అనుమతులు లేకుండానే అక్రమ కట్టడాలను నిర్మించి, యథేచ్ఛగా వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. విరాగో పబ్‌కు అనుమతులిచ్చేందుకు అథారిటీ ఇప్పటికే నిరాకరించినప్పటికీ..నిర్మాణాలను కొనసాగించడం గమనార్హం.
కోర్టు ఆదేశాలతో చర్యలు : ఈ అక్రమ నిర్మాణా లపై పలువురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేయడంతో.. కోర్టు విచారణ చేపట్టి నివేదిక కోరింది. నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా తేలడంతో కోర్టు వీటిని సీజ్ చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా విరాగో పబ్‌లోని 7 గదులు, స్విమ్మింగ్ పూల్, డైనింగ్ హాల్‌ను, అలాగే శాంక్టమ్ రిసార్టులోని గదులు, బార్ అండ్ రెస్టారెంట్, జనరేటర్ రూములను అధికారులు సీజ్ చేశారు. శాంక్టమ్ రిసార్టుకు టూరిజం శాఖ అనుమతులు ఉన్నాయని యాజమాన్యం అధికారులతో వాదనకు దిగింది. అయితే ఈ నిర్మాణాలకు అనుమతులు లేని కారణంగానే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.


