మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 425 వినతులు అందగా, అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు. సమస్య పరిష్కారంలో అలసత్వం వహిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇంచార్జ్ డీఆర్‌వో శేష శైలజ, ఏడీసీ సత్యవేణి, విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఆక్రమణలపై ఫిర్యాదు
గాజువాక భానోజితోట కాకతీయలోవ గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కాలనీలో ప్రభుత్వ గృహ సముదాయానికి వెళ్లే నడకదారిని ఓ మహిళ ఆక్రమించి రేకుల షెడ్డు వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మరణాలు సంభవించినప్పుడు శవాలను తరలించడం కూడా కష్టతరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తహసీల్దార్, జోనల్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఆక్రమణలను తక్షణం తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు.


