డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 128 వినతులు అందాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ ప్రజల నుంచి సమస్యలను స్వీకరించారు. ఫిర్యాదుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 58, ఇంజినీరింగ్ విభాగానికి 30, రెవెన్యూ విభాగానికి 19, అడ్మినిస్ట్రేషన్ విభాగానికి 10, ప్రజారోగ్య శాఖకు 6, మొక్కల విభాగానికి 3, యూసీడీ విభాగానికి 2 చొప్పున వినతులు అందాయి. అనంతరం కమిషనర్ కేతన్‌గార్గ్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై సంబంధిత శాఖాధిపతులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఫిర్యాదీదారులతో సంప్రదించి, నిర్ణీత గడువులోగా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మ, పి.నల్లనయ్య, జాయింట్ డైరక్టర్ విజయభారతి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.


