పెందుర్తిలో జనసేన, టీడీపీ నేతల
బంపర్ ఆఫర్
వేపగుంట సమీపంలో 17 ఎకరాల
భూమిని దోచుకునేందుకు కుట్ర
రూ.60 వేలు ఇస్తే 2 సెంట్ల భూమి
ఇచ్చేస్తున్న కూటమి నేతలు
పక్కనే పేదల గుడిసెలను కూల్చేసిన
రెవెన్యూ అధికారులు
కూటమి నేతలు దోచిపెడుతున్న భూముల
వైపు వెళ్లని చంద్రబాబు ప్రభుత్వం
పేదల గుడిసెలను తొలగించడంపై
భారత నాస్తిక సమాజం ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం : పేదలపై ప్రతాపం చూపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. తమ నేతల కబ్జా కాండకు మాత్రం కొమ్ముకాస్తోంది. టీడీపీ ప్రభుత్వం అండతోనే భూ కబ్జాలు పెచ్చరిల్లుతున్నాయనడానికి పెందుర్తి మండలం చీమలాపల్లి ప్రాంతంలో ఆక్రమణల ఘటనే ప్రధాన ఉదాహరణ. చీమలాపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణల విషయంలో జరుగుతున్న వివక్షపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నెంబర్ 24లోని 17.68 ఎకరాల బంజరు భూమిని దేవదాయ శాఖది కాదని రికార్డులు స్పష్టం చేస్తున్నా, అధికారులు పేదల పాకలను మాత్రం బుల్డోజర్లతో కూల్చివేసి వారిని రోడ్డున పడేశారు. అదే సమయంలో, అధికార పార్టీ నేతల అండతో వెలిసిన అక్రమ షెడ్లను మాత్రం అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
భూములపై కన్నేసి.. కబ్జా చేసి.!
చీమలాపల్లిలో ఎకరం భూమి మార్కెట్ ధర రూ.25 కోట్లకు పైమాటే ఉంటుంది. అంటే మొత్తం దాదాపు 18 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ రూ.450 కోట్ల వరకూ ఉంటుంది. వేపగుంట జంక్షన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఈ విలువైన భూముల్లో పేదల గుడిసెలు చూసిన కూటమి నేతల కన్ను ఆ స్థలంపై పడింది. వెంటనే గుడిసెలు వేసిన పేదల్ని బెదిరింపులకు గురి చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులకు జనసేన, టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ రెవెన్యూ అధికారులు నెల రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై పీవోడబ్ల్యూ నేతలు పోరాటం చేశారు. ఆర్‌డీవోకి అర్హులైన పేదలే అక్కడ నివసిస్తున్నారంటూ వారి జాబితా ఇవ్వడంతో.. రెవెన్యూ అధికారులు వాటి జోలికి వెళ్లలేదు. ఇదే అదనుగా జనసేన, టీడీపీ నేతలు అక్కడ కబ్జా పర్వాన్ని ప్రారంభించారు.
రెండు సెంట్ల స్థలానికి రూ.60 వేలు
పేదలు వేసిన పాకలకు ఎదురుగానే కూటమి నేతల కనుసన్నల్లో కబ్జా పర్వం మొదలైంది. పక్కనే ఉన్న గెడ్డను మూసేశారు. రూ.60 వేలు చెల్లిస్తే.. రెండు సెంట్ల భూమి మీ సొంతం అంటూ ప్రచారం మొదలు పెట్టి.. ఆక్రమణలకు తెర తీశారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 200 మంది నుంచి వసూలు చేసేసి.. పేదల గుడిసెలకు ఎదురుగానే పాకలు వేయించారు. టీడీపీ, జనసేన నేతలతో పాటు ఓ రౌడీ షీటర్ కూడా ఈ ఆక్రమణల వ్యవహారంలో ఎంటర్ అయ్యారు. సదరు రౌడీ షీటర్ కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.50 వేలు చొప్పున 50 మంది నుంచి వసూలు చేసి.. గుడిసెలు వేయించాడు. తర్వాత వీరంతా కలిసి ఒక వింగ్‌గా ఏర్పడి.. కబ్జా దందా కొనసాగించారు. దీనిపై పేదలంతా ఫిర్యాదు చేసినా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీని వెనుక జిల్లాలో ఉన్న ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అక్కడ ఉన్న పేదల పాకలకే ప్రమాదం తప్ప.. వీరి గుడిసెలకు ఉండదంటూ రెవెన్యూ సిబ్బంది హెచ్చరించారు.
పేదలపై ప్రతాపం..
కూటమి నేతలకు అభయహస్తం
శనివారం సాయంత్రం.. పెందుర్తి తహసీల్దార్ వెంకట అప్పారావు.. రెవెన్యూ అధికారులు, పోలీసులతో గుడిసెల వద్దకు చేరుకున్నారు. పేదలు వేసిన గుడిసెల్ని జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు. పేదలంతా ప్రభుత్వ దౌర్జన్యకాండను అడ్డుకోడానికి ప్రయత్నించారు. అడ్డుకోడానికి ప్రయత్నించిన ప్రజా సంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేసి.. బలవంతంగా అక్కడి నుంచి తరలించేశారు. అదే ప్రాంతంలో జనసేన, టీడీపీ నేతల కనుసన్నల్లో సాగుతున్న భూ దందా వైపు మాత్రం.. రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడలేదు. కూటమి నేతలు కబ్జా చేసిన వాటికి రెవెన్యూ అధికారులు అభయహస్తం ఇచ్చినట్లుగా.. వదిలేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పేదల గుడిసెలను కూల్చివేయడం దారుణం
అనేక కష్ట నష్టాలకోర్చి నిర్మించుకున్న పేదల గుడిసెలను పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు కూల్చడం దారుణం. కంపెనీల పేరుతో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను ఎకరం రూపాయి చొప్పున చంద్రబాబు ప్రభుత్వం బడాబాబులకు కట్టబెడుతోంది. ఇదే సమయంలో పేదల విషయంలో ఇలా వ్యవహరించడం దారుణం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కోల్పోయిన ప్రతి కుటుంబానికి రెండు సెంట్లు భూమిని అందించి పునరావాసం కల్పించాల్సిందే.
– జె.రవి, భారత నాస్తిక సమాజం
జాతీయ సమన్వయకర్త
ఇదెక్కడి అన్యాయం
పేదలకు ప్రభుత్వం ఇళ్లు ఇవ్వదు. నిరుపేదల విషయంలో ప్రభుత్వం ఇలా వ్యవహరించడం తగదు. ఎన్నో రోజులుగా ఈ స్థలంలో సుమారు వందల కుటుంబాలు నివాసం ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు. అలాంటి పేదల నివాసాలను కూల్చడం అమానుషం. వెంటనే వారికి పునరావాసం కల్పించాలి. దీనిపై తహసీల్దార్‌తో చర్చించాం. ఆర్డీవోతో కూడా మాట్లాడాం. అయినా పట్టించుకోలేదు. బాధితులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందే.
–ఎం.లక్ష్మి, ప్రగతి శీల
మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు


