కంచరపాలెం: కంచరపాలెం పరిధిలోని రామ్మూర్తి పంతులుపేటలో వెలసిన పైడిమాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘తొలేళ్ల సంబరం’ సోమవారం కన్నుల పండువగా సాగింది. గౌరీ సేవా సంఘం గ్రామాధ్యక్ష, కార్యదర్శులు మద్దాల అప్పారావు, శరకం మూర్తిల సారథ్యంలో జరిగిన ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారి ప్రతిమల ఊరేగింపు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమై, జ్ఞానాపురం, డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి, కాన్వెంట్ కూడలి మీదుగా సాగి తిరిగి అమ్మవారి మూలవిరాట్ సన్నిధికి చేరుకుంది. ఈ శోభాయాత్రలో సుమారు 315 ప్రత్యేక అమ్మవారి ప్రతిమలు కనువిందు చేశాయి. ఎమ్మెల్యే పి. గణబాబు, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఈ ఉత్సవాన్ని ప్రారంభించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు ప్రదర్శించిన వివిధ వేషధారణలు, నేలవేషాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవానికి ఎలాంటి ఆటంకం కలగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షించగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం అమ్మవారి ప్రధాన ఉత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కాండ్రేగుల వెంకటరావు, చదరం భాను, సూరిశెట్టి కిషోర్, సదరం సురేష్, కాండ్రేగుల వెంకట సుకుమార్, పెంటకోట సత్యనారాయణ, బొడ్డేటి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారి ఘటంతో సీపీ శంఖబ్రత బాగ్చి


