బంగారు ఆభరణాల బ్యాగ్ చోరీ
గంటల వ్యవధిలోనే
దొంగను పట్టుకున్న పోలీసులు
గాజువాక : గాజువాకలోని ఓ షాపింగ్ మాల్‌లో బంగారు ఆభరణాలు, నగదు కలిగిన బ్యాగ్‌ను దొంగిలించిన వ్యక్తిని గాజువాక క్రైం పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకుని, అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి.. శ్రీహరిపురానికి చెందిన రవణ, పైడిరాజు దంపతులు గాజువాకలోని ఒక షాపింగ్ మాల్‌కు శుక్రవారం ఉదయం వచ్చారు. 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు ఉంచిన బ్యాగ్‌ను మాల్ సెక్యూరిటీకి అప్పగించి షాపింగ్‌కు వెళ్లారు. షాపింగ్ పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి వారి బ్యాగ్ కనిపించలేదు. దీంతో వెంటనే గాజువాక క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా శ్రీహరిపురానికి చెందిన ముద్దాడ వాసు (30) ఆ బ్యాగ్‌ను దొంగిలించినట్టు గుర్తించారు. వెంటనే శ్రీహరిపురంలో అతడిని పట్టుకుని ప్రశ్నించగా, ఆ బ్యాగు తాను తీయలేదంటూ పోలీసులపై ఎదురుదాడికి యత్నించాడు. దీంతో తమవద్ద గల ఆధారాలను చూపించడంతో అతడు నేరాన్ని అంగీకరించి ఆభరణాలు, నగదు గల బ్యాగును తమకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. కేసును క్రైం సీఐ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు.


