రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
సబ్బవరం: మండంలోని ఇరువాడ సమీపంలో అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై ఉన్న రెస్ట్ ఏరియాలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ జి.రామచంద్రరావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మరణించినట్లు పేర్కొన్నారు. మృతుడి వయస్సు 40–45 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. శరీరంపై గడుల షర్టు, నిక్కరు ఉండగా సుమారు ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటాడని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఆ వ్యక్తి మతిస్థిమితం లేకుండా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి అక్కడి మార్చురీలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. మృతుని ఆచూకీ తెలిసినవారు తమకు సమాచారం అందించాలని కోరారు.


