అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యంగా
వ్యవహరించిన 10 మందికి మెమోలు
48 గంటల్లో పూర్తి వివరణతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశం
పీజీఆర్‌ఎస్‌కు వినతుల వెల్లువ
మహారాణిపేట : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) అధికారుల అలసత్వంపై కలెక్టర్ ఆగ్రహానికి వేదికై ంది. ప్రజల నుంచి వచ్చే వినతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, నాణ్యమైన పరిష్కారం చూపని అధికారులపై కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వినతులపై సరైన ఎండార్స్‌మెంట్ ఇవ్వకుండా, తూతూమంత్రంగా వ్యవహరిస్తున్న జీవీఎంసీ, టౌన్ ప్లానింగ్ విభాగాలకు చెందిన జెడ్సీ, డీసీపీ, ఏసీపీ, డీఈ, ఏఎస్‌ఓ స్థాయిలోని 10 మంది అధికారులకు తక్షణమే మెమోలు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు 48 గంటల్లోగా వివరణతో కూడిన నివేదికలు సమర్పించాలని పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారిని ఆదేశిస్తూ కఠిన చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేదిక ద్వారా బాధితులకు సకాలంలో, నాణ్యమైన న్యాయం జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏ వారం వచ్చిన వినతులను ఆ వారమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఫిర్యాదులు గుట్టలుగా పేరుకుపోయి సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని అధికారులకు సూచించారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత లోపించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా వచ్చిన వినతులపై అధికారులు ఇచ్చిన ఎండార్సుమెంట్లు, ప్రీ–ఆడిట్ విధానం, ప్రజల సంతృప్తి స్థాయిని స్వయంగా విశ్లేషించిన కలెక్టర్, బాధ్యతారాహిత్యంగా ఉన్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
164 వినతుల స్వీకరణ : సోమవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 164 వినతులు రాగా, అందులో జీవీఎంసీకి సంబంధించి 80, పోలీస్ శాఖకు 9, ఇతర శాఖలవి 75 ఉన్నాయి. కార్యక్రమంలో జీవీఎంసీ ఏడీసీ సత్యవేణి, డిప్యూటీ కలెక్టర్ సత్తిబాబు, ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్‌లతో పాటు పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని, ప్రజల సమస్యల పరిష్కారంలో రాజీ పడే ప్రసక్తే లేదని కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


