పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 90 ఫిర్యాదులు
అల్లిపురం: నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 90 ఫిర్యాదులు అందినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ వేదికలో సీపీతో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొని ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులలో ప్రధానంగా కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్యాభర్తల గొడవలు, ఆర్థిక మోసాలు, సివిల్ కేసులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని సీపీ తెలిపారు. ఫిర్యాదులపై ఆయన స్పందిస్తూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడారు. బాధితుల సమస్యలను నిష్పక్షపాతంగా, వేగంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


