సింహాచలంలో ముగిసిన నృసింహ దీక్షలు
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దీక్షల విరమణ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. మండల దీక్ష, 32 రోజులు దీక్షలు చేపట్టిన భక్తులు, తమ శిరస్సులపై తిరుముడిలను ధరించి మెట్ల మార్గం ద్వారాను, ఘాట్ రోడ్డు ద్వారాను కొండపైకి చేరుకున్నారు. దీక్షాధారులందరికీ దేవస్థానం వారు ఉచిత అంతరాలయ దర్శనం కల్పించగా, భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించి దీక్షలను విరమించారు. శ్రీగోకులం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద అర్చకులు శాస్త్రోక్తంగా ఈ విరమణ ప్రక్రియను నిర్వహించారు. కార్య క్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సింహాద్రి మఠం గురుస్వామి కశిరెడ్డి సురేంద్ర, చందన పెరుమాళ్ పీఠం గురుస్వామి సానబోయిన రాజుల నేతృత్వంలో భక్తులు హరినామ స్మరణ చేస్తూ కొండపైకి చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు కొండ పైకి, కిందకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా, అన్న ప్రసాద భవనంలో అందరికీ భోజన వసతి ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ కల్యాణమండపంలో నిర్వహించిన శ్రీనృసింహ హోమాన్ని భక్తులు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లన్నింటినీ ఏఈవోలు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి పర్యవేక్షించారు.


