అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
గోపాలపట్నం: సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉప రవాణా కమిషనర్ ఆర్.సి.హెచ్. శ్రీనివాసరావు హెచ్చరించారు. పండుగ రద్దీ దృష్ట్యా ఆదివారం, సోమవారం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 10 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు, వారి నుంచి రూ. 15,500 జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా 91 92816 07001 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు.


