బంగ్లాదేశ్ చెరలోనే మత్స్యకారులు
చంద్రబాబు చేతకాని పాలనకు
ఇదే నిదర్శనం
ఓట్లు వేయించుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడెక్కడ?
మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి ధ్వజం
తొమ్మిది కుటుంబాలకుఆర్థిక సాయం అందజేస్తా..
డాబాగార్డెన్స్: బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన 9 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులను విడిపించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఆశీలమెట్టలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ, ఇతర నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 9న బంగ్లాదేశ్‌లో భోగాపురం, నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారులు చిక్కుకుపోయారని, వారిని విడిపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కనీసం వారి కుటుంబాలకు ఉపాధి కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులంటే మొదటి నుంచి చిన్న చూపు చూసే చంద్రబాబు వైఖరి ఇప్పటికీ మారలేదని, నేవీకి చిక్కిన వారు బయటకు రావడానికి ఆరు నెలలు పడుతుందని బాధ్యతారాహిత్యంగా చెప్పడం దారుణమన్నారు. జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గానికి చెందిన మత్స్యకారులకు అన్యాయం జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మత్స్యకారుల ఓట్లతో గెలిచిన పవన్ కల్యాణ్.. వారికి కష్టం వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా మాట్లాడడం సరికాదన్నారు. గతంలో శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్‌లో చిక్కుకున్నప్పుడు, నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించి వారిని విడిపించారని గుర్తుచేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి రూ.152 కోట్లు కేటాయించడమే కాకుండా, అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఒక్కో బోటుకు రూ.40 లక్షల చొప్పున పరిహారం అందించిన ఘనత జగన్‌దేనని తెలిపారు. కానీ హుద్‌హుద్ సమయంలో చంద్రబాబు నష్టపోయిన బోట్లకు కేవలం రూ.5లక్షలు ప్రకటించి ఇవ్వలేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1.30 కోట్లను తక్షణమే విడుదల చేసి ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో తోటి మత్స్యకారుడిగా.. తన వంతు బాధ్యతగా ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున, మొత్తం రూ.45 వేల ఆర్థిక సాయాన్ని వాసుపల్లి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని, కేంద్రంతో మాట్లాడి మత్స్యకారులను వెంటనే స్వదేశానికి రప్పించాలని డిమాండ్ చేశారు. కొండా రాజీవ్‌గాంధీ మాట్లాడుతూ జగన్‌ది మమకారపు పాలనైతే, చంద్రబాబుది అహంకారపు పాలన అని విమర్శించారు. చంద్రబాబు సర్కార్‌లో పవన్ కల్యాణ్‌కు పవర్ లేదని విమర్శించారు. సమావేశంలో 37వ వార్డు కార్పొరేటర్, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నా జానకీరామ్, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


