మహారాణిపేట: పేద ప్రజలకు అత్యవసర సమయాల్లో ప్రాణదాతగా నిలిచే 108 వాహనాలకు సుస్తీ చేసింది. జిల్లాలో ఈ సేవలపై గత కొద్ది నెలలుగా ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫోన్ చేసిన గంటల తరబడి వాహనాలు అందుబాటులోకి రావడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందడం ప్రాణరక్షణకు కీలకం. కానీ, అంబులెన్సుల జాప్యం వల్ల ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
మరమ్మతుల సాకుతో మూలకే..
జిల్లాలో ప్రస్తుతం 15 అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో చాలా వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వీటిని సకాలంలో బాగు చేసి రోడ్డుపైకి తీసుకురావడంలో సంబంధిత సంస్థలు విఫలమవుతున్నాయి. నగరంలోని ఒక ప్రైవేట్ షెడ్డులో ఈ వాహనాలను రిపేరు కోసం ఉంచుతున్నారు. వారు ఎప్పుడు బాగు చేసి ఇస్తే అప్పుడే ఆ వాహనం అందుబాటులోకి వస్తోంది. ఈ జాప్యాన్ని అరికట్టడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిర్వీర్యమవుతున్న అపర సంజీవని
2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ పథకాన్ని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మరింత మెరుగుపరుస్తూ 1088 వాహనాలను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సేవల నిర్వహణ గాలికి వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం భవ్య నిధి ఆధ్వర్యంలో ఈ సేవలు నడుస్తున్నాయి. విశాఖలో ఉన్న 16 అంబులెన్సుల్లో ఒకటి రిజర్వుగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదు.
పేదల జేబులకు చిల్లులు
108 వాహనం సకాలంలో రాకపోవడంతో అత్యవసర స్థితిలో ఉన్న పేద రోగులు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఆర్థికంగా లేని వారు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కేవలం హై రిస్క్ కేసులను మాత్రమే తరలించాల్సిన అంబులెన్సులు, కొన్నిసార్లు సాధారణ రిఫరల్ కేసుల కోసం వినియోగించడం వల్ల కూడా అత్యవసర సేవలపై ప్రభావం పడుతోందని సిబ్బంది చెబుతున్నారు.
మరమ్మతులకు గురైతే మూలకే అంబులెన్సులు సకాలంలో అందని అత్యవసర వైద్యం ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతో పేదలకు తిప్పలు


