రిలేలో ఏపీ బాలికలకు స్వర్ణం
విశాఖ స్పోర్ట్స్: నగరంలో జరుగుతున్న 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ స్కేటర్లు మిశ్రమ ఫలితాలను సాధించారు. 12 ఏళ్లు పైబడిన వారికి నిర్వహించిన రోడ్ రేస్–2లో ఏపీ క్రీడాకారులు పతకాల కోసం తీవ్రంగా పోటీపడ్డారు. వంకరగా, నేరుగా ఉండే మూడు లూప్‌లతో, బహుళ దశలుగా సాగే ఈ రేసులో ఏపీకి చెందిన తనూజ త్రుటిలో స్వర్ణాన్ని చేజార్చుకుంది.
రోడ్ రేస్ ఫలితాలివే..
12–15 ఏళ్ల బాలికల విభాగం: బోయపాలెం సర్క్యూట్‌లో జరిగిన క్వాడ్ 1,500 మీటర్ల రేసు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. పుదుచ్చేరి క్రీడాకారిణి శ్రీఆన్యా 2.55.06 నిమిషాల్లో గమ్యాన్ని చేరి విజేతగా నిలిచారు. ఏపీకి చెందిన వి.తనూజ సాయి కేవలం 0.05 సెకన్ల స్వల్ప తేడాతో(2.55.11 నిమిషాలు) వెనుకబడి, రన్నరప్‌గా వెండి పతకంతో సరిపెట్టుకుంది.
15–18 ఏళ్ల బాలుర విభాగం: క్వాడ్ 3000 మీటర్ల ఫైనల్‌లో చండీగఢ్‌కు చెందిన హితిన్ షైనీ 5.36.82 నిమిషాల్లో రేసు పూర్తి చేసి విజేతగా నిలిచాడు.
18+ సీనియర్ బాలుర విభాగం: జమ్ముకశ్మీర్‌కు చెందిన కార్తీకేయ పూరి 5.29.65 నిమిషాల్లో గమ్యాన్ని చేరి విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో తమిళనాడుకు చెందిన ఎస్. సింధు 6.46.79 నిమిషాల్లో రేసు పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇదే రేసులో మహారాష్ట్రకు చెందిన విశాల్ చనేకర్ ద్వితీయ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంచిత తృతీయ స్థానం, గౌరి సుప్రజ చతుర్థ స్థానం దక్కించుకున్నారు.
రిలేలో మెరిసిన ఏపీ బాలికలు
12–15 ఏళ్ల బాలికల రిలే విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకుంది. భవ్యశ్రీ, శ్రీవత్సాంకిత, అద్విక రమ్య, కె.ఖ్యాతి సభ్యులుగా ఉన్న జట్టు సమష్టిగా రాణించి విజయపథాన దూసుకెళ్లింది. బాలుర రిలేలో హర్యానాకు చెందిన ఆరవ్ రావత్, షంతను అగర్వాల్, లావ్యాన్సు ఖండోడియా జట్టు స్వర్ణాన్ని అందుకుంది.
రోలర్ హాకీలో..
జూనియర్ బాలికల విభాగంలో లీగ్ దశలో ఏపీ జట్టు 1–0 గోల్స్ తేడాతో కేరళపై విజయం సాధించింది. సీనియర్ మెన్ విభాగంలో ఏపీ జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తూ 9–2 గోల్స్ తేడాతో తమిళనాడుపై ఘన విజయం సాధించింది. జూనియర్ బాలురు విభాగంలో పంజాబ్ చేతిలో ఏపీ జట్టు 0–7 తేడాతో పరాజయం పాలైంది.
ఉత్కంఠగా రోలర్ హాకీ
రిలేలో ఏపీ బాలికలకు స్వర్ణం


