
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే గెలుపు
ఎంవీపీకాలనీ: పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల గెలుపు ఖాయమని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఎంవీపీ కాలనీలోని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో బీటెక్ రవి భార్య పోటీ చేస్తున్నారని తెలిపారు. ఆమె గెలుపు ఖాయమన్న ఆయన అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి పార్టీలన్నీ చాలెంజ్‌గా తీసుకున్నట్లు వెల్లడించారు. పరామర్శల పేరుతో జగన్‌మోహన్‌రెడ్డి కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే.. దాన్ని జగన్ అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. పెద్దిరెడ్డికి చంద్రబాబుకు పోలికే లేదన్న ఆయన.. పెద్దిరెడ్డిపై కక్షసాధించాలంటే ఆ పని గతంలోనే చేసేవారన్నారు. ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ జగన్ పర్యటనల పేరుతో అవలంబిస్తున్న తీరు మంచిదికాదన్నారు. తీరు మార్చుకోకుంటే హౌస్ అరెస్ట్‌లు చేయడం కూటమి ప్రభుత్వానికి తెలియనిది కాదని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, కూటమి నేతలు పాల్గొన్నారు.