
వనితలదే!
వాణిజ్యం
ఐఐఎం విశాఖ
ఎంబీఏ కోర్సులో
రికార్డు స్థాయిలో
మహిళలు
దశాబ్ది కాలంలో ఇదే అత్యధికం
2015లో కోర్సులను ప్రారంభించిన తర్వాత ఐఐఎం విశాఖపట్నంలో పీజీపీ ఎంబీఏ కోర్సులో మహిళాధిక్యత పెరగడం ఇదే తొలిసారి. ఐఐఎంవీలో మిగిలిన అన్ని కోర్సుల్లో సీ్త్ర–పురుషుల అడ్మిషన్ బేధం 35 నుంచి 40 శాతం ఉండేది. 2015–16లో 10 నుంచి 15 శాతం మంది మహిళలు మాత్రమే కోర్సులో చేరారు. క్రమంగా ఈ అంతరం తగ్గుతూ వస్తోంది. మహిళల్ని ప్రోత్సహించేందుకు వుమెన్ స్టార్టప్స్, సూపర్ న్యూమరీ మొదలైన అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తోంది. అందుకే 2025–26లో 52.16 శాతం మంది మహిళల ప్రవేశాల వెనుక ఐఐఎం అధికారుల శ్రమ ఎంతో ఉంది. ఐఐఎం కోజికోట్‌లో ఫుల్‌టైమ్ పీజీపీలో 51 శాతం మంది మహిళలు చేరారు. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం లక్నోలో 30 శాతం మహిళలు అడ్మిషన్లు పొందారు. బాలికా విద్యకు కుటుంబాల్లో ప్రోత్సాహం పెరుగుతుండటం, రోల్‌మోడల్స్‌ను ఎంపిక చేసుకుని.. వారి లక్ష్యాలకు అనుగుణంగా అడుగులు వేయాలని మహిళల్లో సంకల్పం పెరగడం.. కార్పొరేట్ సెక్టార్‌లో పెరుగుతున్న డిమాండ్ వనితలను ఇటువైపుగా అడుగులు వేయిస్తోంది.
సాక్షి, విశాఖపట్నం : ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్–విశాఖపట్నం(ఐఐఎంవీ) విభిన్న ఆలోచనలతో ముందుకెళ్తోంది. మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్ పొందిన తర్వాత ఐఐఎంలో చేరేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 2015లో ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఐఐఎం విశాఖపట్నంలో ఫ్లాగ్‌షిప్ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లో నారీశక్తి పెరిగింది. 2025–27 విద్యా సంవత్సరంలో మహిళా విద్యార్థులు పైచేయి సాధించారు. ఇటీవలే కోర్సుకు సంబంధించి ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఎంబీఏలో మొత్తం 347 సీట్లుండగా 181 సీట్లు మహిళా అభ్యర్థులు పొందగా.. 166 సీట్లు పురుషులకు దక్కాయి. అంటే 52.16 శాతం సీట్లు వనితలకే దక్కినట్లయింది. ఇందులో 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారున్నారు. వాణిజ్య, మానవ వనరులు, మార్కెటింగ్, తదితర రంగాల్లో రాణించేందుకు మొగ్గు చూపుతున్నారు.
●