
అప్పన్న కొండపై రూ.10 వేలతో పెళ్లి
సింహాచలం: సింహాచలం దేవస్థానంలో వివాహాల నిమిత్తం డెకరేషన్ మండపాల నిర్వహణ బహిరంగవేలం ప్రక్రియను నిలుపుదల చేసినట్టు ఈవో వి.త్రినాథరావు ప్రకటించారు. ఎవరైనా ఆలయం పరిధిలో పెళ్లి చేసుకోవాలనుకుంటూ దేవస్థానానికి రూ.10 వేలు చెల్లించి, దేవస్థానం సూచించిన ప్రదేశాల్లో వివాహాలు చేసుకోవచ్చన్నారు. బయటి వ్యక్తులు/సంస్థల ద్వారా డెకరేషన్ మండపాలు, విద్యుద్దీపాలంకరణ జరిపించుకోవచ్చని పేర్కొన్నారు. వివాహ బృందాల నుంచి మండపాల కాంట్రాక్టర్ అధిక ధరలు వసూలు చేస్తుండటంతో భక్తులకు లబ్ధి చేకూర్చేందుకు డెకరేషన్ మండపాల లీజ్ విధానాన్ని నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న డెకరేషన్ మండపాల నిర్వహణ కాంట్రాక్ట్ జూలై 31తో ముగిసిందన్నారు. కొండపై ఒకే సమ యంలో గజపతి సత్రంలో రెండు వివాహాలకు, పాదాలమ్మ–బంగారమ్మ ఆలయాల వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో మూడు, లోవ తోట వద్ద మూడు వివాహాలకు అనుమతి ఉంటుందన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఈవో అనుమతితో ఆయన సూచించిన ప్రదేశాల్లో కూడా వివాహాలు చేసుకోవచ్చన్నారు. వివాహం ముగిసిన మూడు గంటల్లోపు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. దేవస్థానానికి చెల్లించే రూ.10 వేలుకు అదనంగా రూ.5 వేలు అడ్వాన్స్ కింద చెల్లించాలని పేర్కొన్నారు. శానిటేషన్ నిర్వహణకు రూ.2 వేలు, విద్యుత్ అదనపు లోడ్ ఆధారంగా కొంత మొత్తం మినహాయించుకుని మిగిలిన మొత్తం వాపసు చేయనున్నట్లు వెల్లడించారు.
డెకరేషన్ మండపాల
బహిరంగ వేలం నిలుపుదల