
పరిశ్రమల నిర్వహణకు పూర్తి సహకారం
మహారాణిపేట: జిల్లాలో పరిశ్రమల నిర్వహణకు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. గురువారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన డీఐఈపీసీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్టు అండ్ ప్రమోషన్ కమిటీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఐఐసీ ద్వారా కేటాయించిన భూముల్లో నిర్వాహకులు నిర్ణీత సమయంలోనే పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాల్లో ప్రత్యేక బస్ స్టాప్‌లు ఏర్పాటు చేయాలని, ఆటోనగర్‌లో దుమ్ము, ధూళి రేగకుండా యజమానులు, అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐలా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు.. ఐలా పరిధిలో సోలార్ యూనిట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వడ్లపూడి వద్ద ఆర్వోబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులకు వేగంగా పరిష్కారం చూపాలని, తూనికలు కొలతలు శాఖ అధికారులు వే బ్రిడ్జిలను తనిఖీ చేయాలని చెప్పారు. పీ–4 కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషు, ఫ్యాక్టరీల చీఫ్ ఇన్‌స్పెక్టర్ సురేశ్ కుమార్, ఏపీఐఐసీ జెడ్‌ఎం సింహాచలం, పీసీబీ ఈఈ ముకుందరావు, వివిధ విభాగాల అధికారులు, పాల్గొన్నారు.