
రూ.1.7 కోట్ల భూమికి ఎసరు!
మధురవాడ: విశాఖ రూరల్ మండలం మధురవాడ ప్రాంతంలో ఇప్పటివరకూ ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఎక్కువగా విన్నాం. అయితే తాజాగా వుడా ఆమోదిత లేఅవుట్‌లో ఉన్న ఖాళీ స్థలాలను, గెడ్డలను సైతం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొట్టేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురవాడ రెవెన్యూ గ్రామంలోని సర్వే నం. 281/పీ, 282/పీ, 284/పీ, 300/పీ, 302/పీ, 303/పీ, 305/పీ, 306/పీ, 610/పీ వంటి నంబర్లలో 1990 ప్రాంతంలో షిప్‌యార్డు ఉద్యోగుల కోసం బింద్రానగర్‌లో సుమారు 24.48 ఎకరాల్లో 268 ప్లాట్లతో ఒక లేఅవుట్ ఏర్పాటు చేశారు. ఇందులో రోడ్లు, పార్కులతో పాటు కాలువలు, గెడ్డలు వంటి బహిరంగ స్థలాలు కూడా ఉన్నాయి. కొందరు వ్యక్తులు ఈ ఖాళీ స్థలాలకు, గెడ్డలకు ప్లాట్ నంబర్లకు అదనంగా పీ చేర్చి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు సమాచారం.
211పీ ప్లాట్ నంబరుతో సుమారు రూ.1.75 కోట్ల విలువైన 267 గజాల స్థలాన్ని కాజేశారు. కొందరు వ్యక్తులు ఒక వృద్ధుడిని ముందు పెట్టి ఈ నకిలీ డాక్యుమెంట్లను సృష్టించడమే కాకుండా, జీవీఎంసీ నుంచి అక్రమంగా ప్లాన్ పొంది కొద్ది రోజులుగా చకచకా నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టారు. అయితే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఈ పనులను నిలుపుదల చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అధికారుల పాత్ర : ఈ అక్రమాల్లో ఓ జీవీఎంసీ సర్వేయర్ సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అతని సహకారంతోనే తప్పుడు సర్వే రిపోర్టులు సృష్టించి, రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా, ప్లాన్‌ను కూడా పొందారని సమాచారం. ఈ తప్పుల్లో భాగస్వాములైన జీవీఎంసీ అధికారులు తాము ఎక్కడ బయటపడతామోనని ఆచుతూచి వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ విషయం బయటకు రాకుండా వారు సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఈ స్థలంలో ఇలాంటి మరికొన్ని నిర్మాణాలు కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది.
పనులు నిలుపుదల చేయించిన అధికారులు
తప్పుడు పత్రాలతో గెడ్డ, ఖాళీ స్థలాల ఆక్రమణ
బెదిరింపులకు దిగుతున్న ముఠా
ఈ అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు కొందరు ముఠాగా ఏర్పడి, ఈ వ్యవహారాన్ని ఎవరైనా బయటపెడితే అంతు చూస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. పోలీసు కేసులు పెడతామని, వారు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగస్వాములైన అధికారులనూ బయటకు లాగుతామంటూ ప్రచారం చేస్తున్నట్లు కూడా సమాచారం. ఈ విషయంలో ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే స్పందించి, తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

రూ.1.7 కోట్ల భూమికి ఎసరు!