
స్టాళ్ల కేటాయింపులో పారదర్శకత
విశాఖ విద్య: జిల్లాలోని రైతుబజార్లలో డ్వాక్రా, దివ్యాంగులకు సంబంధించిన స్టాళ్ల కేటాయింపును నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహిస్తామని మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.శ్రీనివాస కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 28న ‘రైతు బజార్లపై కూటమి గద్దలు’అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలోని రైతుబజార్లలో డ్వాక్రా, దివ్యాంగుల కోసం కేటాయించిన 100 స్టాళ్ల గడువు ముగియడంతో.. వాటి నిర్వహణకు కొత్త లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు శ్రీనివాస కిరణ్ వివరించారు. ఈ స్టాళ్ల కోసం మొత్తం 580 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలోని డీఆర్‌డీఏ, జీవీఎంసీ యూసీడీ, వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత, జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో కలెక్టర్ కార్యాలయంలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని శ్రీనివాస కిరణ్ స్పష్టం చేశారు.