
కొత్త కార్డులకు కొర్రీలు
● కార్డుల కోసం వేలల్లో దరఖాస్తులు ● సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు ● చుక్కలు చూపిస్తున్న నిబంధనలు ● కార్డుల్లో మార్పులు, చేర్పులకు నో ఆప్షన్
మహారాణిపేట: ఎన్నికల ముందు అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు దరఖాస్తుదారులకు కఠిన నిబంధనలతో గట్టి షాక్ ఇస్తోంది. కొత్త కార్డులు వస్తాయన్న ఆశతో సచివాలయాలకు పరుగులు తీస్తున్న వేలాది మందికి అక్కడి నిబంధనలు చూసి నిరాశే ఎదురవుతోంది. దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న అడ్డంకులు, సాఫ్ట్‌వేర్ సమస్యలతో అర్హులు సైతం అనర్హులుగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది తర్వాత కొత్త కార్డుల దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అయితే ప్రభుత్వం విధించిన పలు నిబంధనలు దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక కార్డులో తల్లిదండ్రులు, కుమారుడు ఉండి.. కుమారుడికి వివాహమైతే కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. కుమారుడిని ప్రస్తుత కార్డు నుంచి తొలగించడం లేదా కుమారుడు, కోడలి పేరిట కొత్త కార్డు ఇవ్వడానికి నిబంధనలు అడ్డుపడుతున్నాయి. తొలగింపు, చేర్పులకు సాఫ్ట్‌వేర్‌లో ఆప్షన్ లేదు. ఇదే పరిస్థితి వివాహమైన కుమార్తెల విషయంలోనూ ఉంది. దీంతో కొత్త జంటలు కార్డులు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఒక కార్డులోని కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. ఆ కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పింఛన్లు, ఇతర పథకాలు కూడా నిలిచిపోతున్నాయి. ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొత్త రేషన్ కార్డు కోసం కరెంటు బిల్లు తప్పనిసరి చేశారు. ఎప్పుడైనా పొరపాటున అధిక బిల్లు వచ్చినా, వారి దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. ఆ బిల్లును విద్యుత్ కార్యాలయంలో సరిచేయించుకుని వచ్చే వరకు దరఖాస్తుకు అవకాశం లేకుండా పోతోంది. భార్యాభర్తల ఆధార్ కార్డులలో వేర్వేరు చిరునామాలు ఉంటే, వారి దరఖాస్తు ముందుకు సాగడం లేదు. ఇద్దరి చిరునామాలను ఒకే ప్రాంతానికి మ్యాపింగ్ చేస్తేనే కార్డుకు దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతోంది. ఈ కఠిన నిబంధనలకు తోడు, సర్వర్ సమస్యలు దరఖాస్తుదారులకు తలనొప్పిగా మారాయి. గంటల తరబడి వేచి ఉన్నా సర్వర్ డౌన్ లేదా ఈ ఆప్షన్ లేదు అనే సమాధానమే సచివాలయ సిబ్బంది నుంచి వస్తోంది. దీనిపై ఏమి చేయాలో తెలియని సిబ్బంది, దరఖాస్తుదారులను కలెక్టరేట్‌లోని సివిల్ సప్లైస్ కార్యాలయానికి పంపుతున్నారు. అక్కడికి వెళ్తే, తిరిగి సచివాలయంలోనే నమోదు చేసుకోవాలని చెప్పడంతో ప్రజలు అటూ ఇటూ తిరుగుతూ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఆగస్టు 25 నుంచి కొత్త కార్డులు ఇస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తే అది ఎంతవరకు సాధ్యమవుతుందనే దానిపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఈ అడ్డగోలు నిబంధనలను సడలించి, సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేస్తేనే కొత్త కార్డుల జారీ సాధ్యమవుతుంది. లేకపోతే పేదల ఆశలు అడియాసలుగానే మిగిలిపోతాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.