
ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ప్రారంభం
ఆరిలోవ: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. డీఈవో కార్యాలయ సెల్లార్‌లో దివీస్ సంస్థ అందించిన రూ.22.60 లక్షల సీఎస్సార్ నిధులతో నిర్మించిన ఈ కేంద్రాన్ని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్.. డీఈవో ఎన్.ప్రేమకుమార్, దివీస్ ప్రతినిధులతో కలసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమెల్సీ మాట్లాడుతూ జిల్లాలో పాఠశాల విద్య అభివృద్ధికి ప్రైవేట్ కంపెనీలు సాయపడటం అభినందనీయమన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు కష్టపడి విద్యార్థుల ఉత్తీర్ణతను శతశాతానికి పెంచి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని అభిలషించారు. దివీస్ జనరల్ మేనేజర్ కోటేశ్వరరావు, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ బి.చంద్రశేఖర్, డీఈవో కార్యాలయ సిబ్బంది, దివీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో శ్రీకారం
వాస్తవానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో దివీస్ సంస్థ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం నిర్మాణానికి రూ.22.60 లక్షలు నిధులు కేటాయించింది. అప్పటి డీఈవో ఎల్.చంద్రకళ సూచనలతో కార్యాలయం సెల్లార్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు సిద్ధమై పనులు జరిపించారు. 2024 సాధారణ ఎన్నికలు రావడంతో కొన్నాళ్లు నిలిచిపోయాయి. రెండు నెలల కిందట దీని పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. అప్పుడే అసలు ట్విస్ట్ డీఈవో ప్రేమకుమార్‌కు ఎదురైంది. దివీస్ సంస్థ ప్రతినిధులు రెండు వారాల క్రితం భీమిలి ఎమెల్యే గంటా శ్రీనివాసరావును ప్రారంభానికి పిలిచారు. దీని ప్రకారం ఇక్కడ శిలాఫలకంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు ముఖ్యఅతిథిగా రాయించారు. విషయం తెలుసుకున్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి డీఈవో ప్రేమకుమార్‌పై శివాలెత్తినట్లు సమాచారం. నా నియోజకవర్గంలో వేరే ఎమ్మెల్యేని ప్రారంభానికి పిలుస్తారా అంటూ డీఈవోపై మండిపడినట్లు తెలిసింది. దీంతో అప్పట్లో జరగాల్సిన ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. కొత్త శిలాఫలకం తయారుచేయించి బుధవారం ప్రారంభోత్సవం చేసినట్లు విద్యాశాఖ సిబ్బంది గుసగుసలు వినిపించాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దివీస్ సంస్థ ముందుకు వచ్చి దీన్ని నిర్మిస్తే.. కూటమి నాయకులు తమ ఘనతగా చెప్పుకుని సీఎం కల సాకారమంటూ ఉపన్యాసం ఇవ్వడంపై విద్యాశాఖ అధికారులే నివ్వెరపోయారు.
గత ప్రభుత్వంలో దివీస్ సీఎస్సార్
నిధులతో నిర్మాణానికి శ్రీకారం