
గొయ్యిని తప్పించబోయి.. మృత్యు ఒడికి..
కూర్మన్నపాలెం: ‘ఇంకొద్ది సేపట్లో ఇంటికి వస్తున్నా..’ అని చెప్పి కంపెనీ నుంచి బయలుదేరిన ఆ యువకుడి మాటలే చివరివయ్యాయి. విధులకు వెళ్లిన భర్త తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న ఆ నవ వధువుకు తీరని శోకం మిగిలింది. కళ్లెదుటే భవిష్యత్తు బంగారంగా కనిపిస్తుండగా.. రహదారిపై ఉన్న గొయ్యి ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. ఒక ఇంజినీర్ నూరేళ్ల జీవితాన్ని బలిగొంది. సినర్జీస్ సంస్థలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రాహుల్‌కు ఈ ఏడాది మేలోనే వివాహం జరిగింది. భార్య, తండ్రితో కలిసి జీవీఎంసీ 87వ వార్డు కణితికాలనీలోని వైష్ణవి అపార్టమెంట్‌లో నివాసం ఉంటున్నాడు. రోజూ లాగే బుధవారం కూడా విధులను ముగించుకుని తన బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. దువ్వాడ సమీపంలోని రాజీవ్‌నగర్ వద్ద రహదారిపై ఉన్న ఓ గొయ్యి రూపంలో మృత్యువు కాపు కాసింది. ఆ గొయ్యిని తప్పించే చిన్న ప్రయత్నంలో రాహుల్ అదుపుతప్పాడు. బైక్‌పై నుంచి కింద పడి.. వెనకనే వస్తున్న భారీ ట్రాలర్ చక్రాల కింద నలిగిపోయాడు. అక్కడికక్కడే కన్నుమూశాడు. కొద్ది నిమిషాల్లో ఇంట్లో ఉండాల్సిన రాహుల్.. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న దృశ్యం చూపరుల హృదయాలను కలచివేసింది. ఈ వార్త తెలియగానే ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తన కుమారుడు నేల మీద నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఉన్న ఆ గొయ్యి.. ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. రాహుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ మల్లేశ్వరరావు నేతృత్వంలో ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
టాలర్ కింద పడి సినర్జీస్ ఉద్యోగి మృతి
గత మే నెలలో వివాహం

గొయ్యిని తప్పించబోయి.. మృత్యు ఒడికి..