
ఏషియన్ రోలర్ స్కేటింగ్‌లో దినేష్ సత్తా
తగరపువలస: దక్షిణ కొరియాలో ఈ నెల 29న జరిగిన 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో ఆనందపురం మండలం వెల్లంకి గ్రామ పంచాయతీకి చెందిన గొలగాని దినేష్ రెండు రజత పతకాలు సాధించి తన సత్తా చాటాడు. ఆర్టిస్టిక్, వ్యక్తిగత విభాగాల్లో ఈ పతకాలు సాధించడం విశేషం. 2023లో చైనాలో జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్‌లో కూడా దినేష్ రజత పతకం సాధించాడు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 6 బంగారు, రాష్ట్ర స్థాయిలో 15 బంగారు, జిల్లా స్థాయిలో 18 బంగారు పతకాలు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తల్లిదండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహంతోనే ఈ స్థాయిలో చేరుకున్నానని దినేష్ తెలిపాడు. మధురవాడలో 10వ తరగతి చదువుతున్న దినేష్ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించడం తన లక్ష్యమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా దినేష్‌ను కోచ్‌లు సత్యం, చిట్టిబాబు అభినందించారు.
క్షేత్రకు రజతం
ఎంవీపీకాలనీ: సౌత్ కొరియాలో జరిగిన రోలర్ స్కేటింగ్ పోటీల్లో నగరానికి చెందిన శివకోటి క్షేత్ర ప్రతిభ చూపింది. ఎంవీపీ కాలనీలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న క్షేత్ర ఈ పోటీల్లో రజతం సాధించింది. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం, కుటుంబ సభ్యులు క్షేత్రను అభినందించారు. ఇప్పటి వరకు క్షేత్ర 21 జాతీయ మెడల్స్‌తో సహా 70 పతకాలు సాధించింది.

ఏషియన్ రోలర్ స్కేటింగ్‌లో దినేష్ సత్తా