
‘దాట్ల’కు రావిశాస్త్రి సాహిత్య పురస్కార ప్రదానం
సీతంపేట: ప్రముఖ కవి, కథా రచయిత, దాట్ల దేవదానం రాజు(యానాం)కు రావిశాస్త్రి సాహితీ పురస్కారాన్ని ప్రధానం చేశారు. విశాఖ రసజ్ఞ వేదిక, రావిశాస్త్రి లిటరరీ ట్రస్టు సంయుక్త నిర్వహణలో ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో బుధవారం జరిగిన సభలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ టి.రవిరాజు, విశాఖ రసజ్ఞ వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ రఘురామారావు, రావిశాస్త్రి తనయుడు ఉమా కుమార శాస్త్రి చేతుల మీదుగా దాట్ల దేవదానం రాజును సత్కరించి, పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా రఘురామారావు మాట్లాడుతూ రావిశాస్త్రి 103వ జయంతి సందర్భంగా యానాంకు చెందిన కథా రచయిత దాట్ల దేవదానంరాజుకు పురస్కారం అందజేసినట్టు తెలిపారు. గత ఐదేళ్లుగా విశాఖరసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో రావిశాస్త్రి పేరిట పురస్కారాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం,డాక్టర్ రవిరాజు మాట్లాడుతూ దాట్ల సాహితీ ప్రతిభకు రావిశాస్త్రి పురస్కారం ఒక కొలమానంగా నిలుస్తుందన్నారు. దాట్ల రాసిన ఎండ్ల బండి, దీపం కింద నీడ వంటి రచనలు పాఠకుల ఆదరణ పొందాయని చె ప్పారు. కవిసంధ్య సాహితీ పత్రికను నిర్వహించడమే కాక, ఎందరో యువ కవులకు దాట్ల మార్గదర్శనం చేస్తున్నారని గుర్తుచేశారు. అనంతరం దాట్ల దేవదానం రచించిన ‘మనిషి లోపల నీడ’ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. తొలి ప్రతిని ఆచార్య బేతవోలు స్వీకరించారు. డాక్టర్ డి.వి.సూర్యారావు, ప్రయాగ సుబ్రహ్మణ్యం, పలువురు సాహితీవేత్తలు, కథా రచయితలు పాల్గొన్నారు.