
కుళాయిల నుంచి కలుషిత నీరు
● చిన్న ములగాడలో మూడు రోజులుగా సరఫరా ● అనారోగ్యం పాలవుతున్న గ్రామస్తులు
మల్కాపురం: జీవీఎంసీ 58వ వార్డులోని చిన్న ములగాడ గ్రామంలో మూడు రోజులుగా బురద రంగుతో కూడిన కలుషిత నీరు సరఫరా అవుతోందని గ్రామస్తులు ఆరోపించారు. మున్సిపల్ కుళాయిల ద్వారా వస్తున్న ఈ నీటిని తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని, జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు ములగాడలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య సేవలు పొందుతున్నారు. మంచినీటి పైప్‌లైన్ ఎక్కడో లీక్ అవ్వడం వల్లే ఈ కలుషిత నీరు వస్తోందని, ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై మల్కాపురం వాటర్ సప్లై ఏఈ నాగేశ్వరరావును వివరణ కోరగా.. ఆ గ్రామంలో పైప్‌లైన్‌కు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. భారీ వాటర్ ట్యాంకులు శుభ్రం చేసేటప్పుడు ఒకటి లేదా రెండు రోజులు తేలికపాటి బురద రంగు గల నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. గురువారం ఆ ప్రాంతానికి వెళ్లి సమస్యను గుర్తించి, పరిష్కరిస్తామని తెలిపారు.