
భూముల క్రమబద్ధీకరణ వేగవంతం
మహారాణిపేట: ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని, అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు క్రమబద్ధీకరణకు ముందుకు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. శ్లాబ్ లేదా రేకులతో ఇల్లు నిర్మించుకున్న వారు జీవో ఎంఎస్ నంబర్ 30, 45, 27(యూఎల్‌సీ)లకు లోబడి ఈ ఏడాది డిసెంబరు 31లోగా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పారు. దారిద్య్రరేఖకు దిగువన ఉండి 151 నుంచి 300 గజాలలోపు ఆక్రమణలకు బేసిక్ ధరలో 15 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజులో 50 శాతం చెల్లించాలని చెప్పారు. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారు పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. 450 గజాలకు మించి ఆక్రమించిన వారు, బేసిక్ ధరకు ఐదు రెట్లు, వందశాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం(పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టరు ఆదేశించారు. జేసీ కె.మయూర్ అశోక్, ఆర్డీవోలు శ్రీలేఖ, సంగీత్ మాధుర్, డీఆర్వో బి.హెచ్.భవాని శంకర్, సర్వే శాఖ సహాయ సంచాలకుడు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.