
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
తగరపువలస: ఆనందపురం మండలం చందకలో కెనరా బ్యాంక్ స్థానిక బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ‘సురక్షజ్యోతి’ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ విజయవాడ సర్కిల్ జనరల్ మేనేజర్ సీజే విజయలక్ష్మి.. సామాజిక భద్రతా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సైబర్ మోసాలలో సున్నితత్వం, ఈ కేవైసీ ప్రాముఖ్యత, ఖాతాలలో నామినేషన్ వివరాలు నవీకరించడం గురించి తెలియజేశారు. దేశంలోనే రెండో అతి పెద్ద ప్రభుత్వ యాజమాన్య సంస్థల్లో ఉన్న కెనరా బ్యాంకు పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై, ఏపీవై వంటి సామాజిక భద్రతా పథకాలను విస్తృతంగా అమలు చేస్తోందన్నారు. విశాఖ రీజనల్ హెడ్, ఏజీఎం ఎన్.మధుసూదనరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. డివిజనల్ మేనేజర్ హెచ్.ప్రతాప్‌కుమార్, బంక సత్యం, సర్పంచ్ బంక శ్రీను, మాజీ సర్పంచ్ జీవీ రమణ, ఎంపీటీసీ సభ్యుడు ఎం.నాగేశ్వరరావు, రాజు, సోమినాయుడు, బ్యాంకు సిబ్బంది, వందల సంఖ్యలో పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.