
నిబంధనలు అతిక్రమిస్తే సీజ్ చేస్తాం
సరోగసీ, ఐవీఎఫ్ సెంటర్లకు డీఎంహెచ్‌వో హెచ్చరిక
మహారాణిపేట: సరోగసీ, ఐవీఎఫ్ సెంటర్లు నిబంధనల ప్రకారం మాత్రమే పనిచేయాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. జగదీశ్వరరావు హెచ్చరించారు. మంగళవారం రేసవానిపాలెంలోని డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో సరోగసీ, ఐవీఎఫ్ సెంటర్ల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సెంటర్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే సెంటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే అనుమతి లేకుండా ఐవీఎఫ్, సరోగసీ నిర్వహించినా చర్యలు తప్పవని, అనుమా నం వచ్చిన వాటికి నోటీసులు జారీ చేస్తామన్నారు. లైసెన్స్ గడువు ముగిసినా సృష్టి సెంటర్ నడిపారని, విశాఖలోని సృష్టి సెంటర్లపై నిఘా పెట్టామని డీఎంహెచ్‌వో తెలిపారు. సమావేశంలో 53 ఐవీఎఫ్, సరోగసీ సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు.
ఐవీఎఫ్, సరోగసీ సెంటర్లలో తనిఖీలు
నగరంలోని ఐవీఎఫ్, సరోగసీ సెంటర్లను డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తన బృందంతో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారిపై ఉన్న పద్మశ్రీ ఐవీఎఫ్ సెంటర్, పీఎంపాలెంలోని ఓయాసిస్ ఐవీఎఫ్ సెంటర్లను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి ఐవీఎఫ్ సెంటర్‌లో గైనకాలజిస్ట్‌లు, ఆండ్రాలజిస్ట్‌లు, ఎంబ్రియోలాజిస్ట్‌లు నిరంతరం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఐవీఎఫ్, సరోగసీ సెంటర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని చేయాలని, ఎటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అలాగే సకాలంలో రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేసుకోవాలని స్పష్టం చేశారు. నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉమావతి నగరంలోని సరోగసీ సెంటర్లు, సహాయక పునరుత్పత్తి సాంకేతిక (ఏఆర్‌టీ) బ్యాంక్ ఎల్1, ఎల్2లను పరిశీలించి.. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు.