
విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి
డాబాగార్డెన్స్: ప్రజలపై భారాలు మోపే అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కార్మిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్‌లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డును మూడు ముక్కలుగా చేసి ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కం పేరిట విభజించారని, ఇప్పుడు మళ్లీ విద్యుత్ సంస్థలను మొత్తం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు పూనుకుంటున్నారన్నారు. అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లను తీసుకువచ్చారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే వాటిని బద్దలు కొట్టండి అన్న లోకేష్, అధికారంలోకి వచ్చాక విద్యుత్ సంస్కరణ పనులను రాష్ట్రంలో శరవేగంగా అమలు చేస్తున్నారన్నారు. ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. విద్యుత్ స్మార్ట్‌మీటర్ల ఉపసంహరణ కోరుతూ ఆగస్ట్ 5న ఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు చెప్పారు. ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ఎస్‌కే రెహ్మాన్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, ఆర్‌కేఎస్‌వీ కుమార్ తదితరులు మాట్లాడుతూ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని, ప్రజాసంఘాలన్నీ సిద్ధం కావాలని కోరారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని, లేకుంటే 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాట స్ఫూర్తితో అలాంటి పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎం.మన్మధరావు, కె.దేవ, తిరుపతిరావు, బేగం, ఎస్.గౌరీ, ప్రకాశరావు, యూఎస్‌ఎన్ రాజు, ఎల్‌జే నాయుడు, నాయనబాబు తదితరులు పాల్గొన్నారు.
5న సీఎండీ కార్యాలయం వద్ద మహాధర్నా