
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
అగనంపూడి: ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రీపెయిడ్ ఆటోస్టాండ్‌ను ఏర్పాటు చేసినట్లు వాల్తేర్ డీఆర్‌ఎం లలిత్ బొహ్రా, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. దువ్వాడ రైల్వేస్టేషన్ నాలుగో నంబర్ ప్లాట్‌ఫాం వైపు ప్రీ పెయిడ్ ఆటో, ట్యాక్సీ స్టాండ్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దువ్వాడ రైల్వేస్టేషన్ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యంతో ఆటో, ట్యాక్సీలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అలాగే టారిఫ్‌లను ఖరారు చేశామని, ఆ మేరకు మాత్రమే ప్రయాణికులు చెల్లించాలని సూచించారు. డ్రైవర్లు అధిక చార్జీలు డిమాండ్ చేసినా లేదా ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనా రైల్వే అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సుమారు 70 ఆటోలు ప్రీపెయిడ్ ఆటో స్టాండ్‌లో నమోదయ్యాయని.. వీటన్నింటికీ జీపీఎస్ ట్రాకింగ్ చేస్తామన్నారు. ఈ సందర్భంగా దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రైల్వేస్టేషన్ పరిధిలో కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేయాలని సీపీకి ఓ వినతిపత్రంలో కోరారు. వందే భారత్‌కు దువ్వాడలో హాల్ట్ ఇవ్వాలని, సౌకర్యాలు కల్పించాలని డీఆర్‌ఎంకు వినతిపత్రం అందించారు. డీసీపీ మేరీ ప్రశాంతి, ఏసీపీ వై.శ్రీనివాసరావు, సీనియర్ డీసీఎం కె.సందీప్, సీనియర్ డీఈఈ ఎం.ఎస్.ఎన్.మూర్తి, డీఈ సాయి అనూప్, తూర్పు కోస్తా రైల్వే జోనల్ కన్సల్టెన్సీ కమిటీ సభ్యుడు కంచుమూర్తి ఈశ్వర్, దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జాషువా, మురళీధర్‌రెడ్డి, బి.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దువ్వాడలో ప్రీ పెయిడ్ ఆటో, ట్యాక్సీ స్టాండ్ ప్రారంభం