
నిత్యావసర వస్తువుల విక్రయాలపై నిఘా
మహారాణిపేట: నిత్యావసర వస్తువుల విక్రయ ధరలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి మాత్రమే స్టాక్ నిల్వలను ఉంచాలని, పరిమితికి మించి నిల్వ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో మంగళవారం సివిల్ సప్లై, మార్కెటింగ్ అధికారులు, వర్తకులతో బియ్యం, పంచదార, పప్పుదినుసులు, కూరగాయల ధరల నియంత్రణ, అదుపుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో బియ్యం, పంచదార, పప్పు దినుసుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయని, ఈ పరిణామం ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని పేర్కొన్నారు. ప్రజలకు సరసమైన ధరలకే సరకులు విక్రయించాలని స్పష్టం చేశారు. నగర పరిధిలోని 13 రైతుబజార్లలో బియ్యం, పంచదార, పప్పు దినుసులతో కూడిన ప్రత్యేక కౌంటర్లు కొనసాగించాలని డీఎస్‌వో వి.భాస్కరరావు, మార్కెటింగ్ శాఖ డీడీ శ్రీనివాస్ కిరణ్‌లను ఆదేశించారు. ఈ సందర్భంగా వర్తకులు తమ సమస్యలను జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని, లాభాపేక్ష లేకుండా విక్రయాలు జరుపుతామని హామీ ఇచ్చారు.
గ్యాస్ డెలివరీ చార్జీలు వసూలు చేస్తే చర్యలు
దీపం పథకం అర్హతలు, నిధుల జమపై ప్రజలకు సవివరంగా చెప్పాలని జేసీ సూచించారు. గ్యాస్ డెలివరీ సమయంలో బాయ్స్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అలా చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. చెకింగ్ ఇన్‌స్పెక్టర్లు ఈ వ్యవహారంపై ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే గ్యాస్ ఏజెన్సీలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సివిల్ సప్లైస్ డీఎం ఎం.శ్రీలత, ఇతర అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వర్తకుల సంఘం ప్రతినిధులు, ట్రేడర్లు, హోల్ సేలర్స్, రిటైలర్లు పాల్గొన్నారు.
జేసీ మయూర్ అశోక్