
పైడితల్లి అమ్మవారి పూజారి లండ మృతి
సింహాచలం: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పూజారి, 98వ వార్డు వైఎస్సార్‌సీపీ నాయకుడు, అడవివరం కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ లండ వెంకటరమణ(45) మంగళవారం మృతిచెందారు. ఆయన.. భార్య దేవితో కలిసి ఈ నెల 27న సింహాచలం నుంచి ఆనందపురం మండలం గిడిజాలలో జరిగే ఓ పుట్టినరోజు ఫంక్షన్‌కు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. గుడిలోవ సమీపంలో వీరి బైక్‌ను కారు ఢీకొనడంతో వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే నగరంలోని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన కొడుకు నితిన్ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం, కుమార్తె ప్రజ్ఞ 9వ తరగతి చదువుతున్నారు. ఆది నుంచి లండ వెంకటవమణ దివంగత మహానేత వైఎస్సార్, ఆ తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పెద్ద అభిమానిగా ఉన్నారు. కొడుకు నితిన్‌కు చిన్నప్పుడు గుండె సమస్య రావడంతో ఆరోగ్యశ్రీలో చికిత్స జరిగింది. ఆయన మృతదేహానికి అడవివరం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, 98వ వార్డు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కొలుసు ఈశ్వరరావు, 98వ వార్డు కార్పొరేటర్ పి.వి.నరసింహం నివాళులర్పించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.