
ఉద్యోగాల కల్పనే లక్ష్యం
జేసీ మయూర్ అశోక్
బీచ్ రోడ్డు: రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 20 వేల స్టార్టప్‌లను స్థాపించి, వాటి ద్వారా లక్ష ఉద్యోగాలను సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనమందరం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో మంగళవారం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవంలో జేసీ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన జీఎస్‌డబ్ల్యూఎస్ సిబ్బందిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి.. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషమన్నారు. ‘ఇది కేవలం శిక్షణ కార్యక్రమం మాత్రమే కాదు, మీలో ప్రతి ఒక్కరిలో ఉన్న అద్భుతమైన సామర్థ్యాలను వెలికి తీయడానికి ఇది ఒక చక్కని అవకాశం’ అని అన్నారు. శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా రాష్ట్రవ్యాప్తంగా స్టార్టప్‌లపై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇవ్వనున్నారని జేసీ వెల్లడించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో సూర్య తేజ తదితరులు పాల్గొన్నారు.