
జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 174 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 174 వినతులు స్వీకరించారు. మేయర్ పీలా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఫిర్యాదుల్లో పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 84 ఫిర్యాదులు అందాయి. జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 4, రెవెన్యూకు 17, ప్రజారోగ్యానికి 12, ఇంజనీరింగ్ విభాగానికి 47, హార్టికల్చర్‌కు 1,యూసీడీ విభాగానికి 9 అందాయి. ఈ సందర్భంగా కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వార్డు సచివాలయాల వారీగా అడ్మిన్ కార్యదర్శులు పరిష్కరించాల్సిన ఫిర్యాదులు 30 రోజుల నుంచి వారి లాగిన్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఏ విభాగానికి సంబంధించిన ఫిర్యాదును ఆయా విభాగాధిపతులు తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.