
16 ఏళ్ల కుర్రోడు.. సత్తాచాటాడు
● వాలీబాల్‌లో జాతీయస్థాయి ప్రతిభ ● భారత్‌జట్టుకు చరణ్ ఎంపికపై హర్షాతిరేకాలు
కూర్మన్నపాలెం : ఆటల పట్ల ఎలాంటి అవగాహన లేని 16 ఏళ్ల అడ్డాడ చరణ్, అనతి కాలంలోనే అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడిగా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వడ్లపూడిలోని కణితి కాలనీకి చెందిన చరణ్.. థాయిలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో భారతదేశానికి మూడో స్థానం సాధించి పెట్టాడు. కేవలం ఏడున్నర నెలల శిక్షణతో 16 దేశాలతో పోటీపడి ఈ ఘనత సాధించడం విశేషం.
కణితి కాలనీలోని తన మేనమామల వద్ద పెరుగుతూ ఉక్కునగరం డీఏవీపీ స్కూల్‌లో చదువుతున్న చరణ్, ఈ నెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు థాయిలాండ్‌లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాడు. ఆసియా వాలీబాల్ కాన్ఫెడరేషన్ ఈ క్రీడలకు సారథ్యం వహించింది. ఈ పోటీల్లో చరణ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. అంతేకాకుండా ఈ పోటీలకు దక్షిణ భారతదేశం నుంచి ఆయనొక్కడే ఎంపిక కావడం విశేషం. అలాగే వచ్చే ఏడాది ఖతర్‌లో నిర్వహించే ప్రపంచ చాంపియన్ పోటీలకు కూడా చరణ్‌ను భారత జట్టుకు ఎంపిక చేశారు.
కరోనా సమయంలో వాలీబాల్‌వైపు..
క్రీడల పట్ల ఏమాత్రం అవగాహన లేని చరణ్‌కు కరోనా మహమ్మారి విజృంభించిన సమయం కలిసొచ్చింది. ఆ సమయంలో పాఠశాలలన్నీ మూతబడటంతో, ఎటూ తోచక చాలా సమయం ఇంట్లోనే గడిపేవాడు. అయితే ఒకసారి ఇంట్లో విసుగు అనిపించి సమీపంలోని మైదానం వైపు వెళ్లాడు. అప్పటికే అక్కడ తన వయసు ఉన్న పిల్లలు వాలీబాల్ ఆడటం గమనించాడు. అలా వాలీబాల్‌పై మక్కువ పెరిగింది. ఆ తరువాత పాఠశాలలు తెరచుకున్న తరువాత చరణ్ ఆడుతున్న తీరును ఉపాధ్యాయులు గమనించి ప్రోత్సహించారు. డీఏవీపీ పాఠశాలల కేంద్ర కార్యాలయం ఢిల్లీ, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పోటీలకు చరణ్‌ను ఎంపిక చేశారు. ఆ పోటీల్లో చరణ్‌సత్తా చాటాడు. చరణ్ మేనమావ.. అక్కయ్య పాలెం స్టేడియంలో స్పోర్ట్స్ కోచ్‌ను సంప్రదించి ఆయన వద్దకు తీసుకెళ్లారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఆయన వద్ద చరణ్ అన్ని మెలకువలు తెలుసుకొని వాలీబాల్ ఆటలో ఆరితేరిపోయాడు. ఈ లోగా థాయిలాండ్‌లో జరిగే పోటీలకు ఎంపిక జరగడంతో ముందుగా చరణ్‌ను ఎంపిక చేసి భారత జట్టుతో పంపించారు. ఆయనకు జాతీయ స్థాయి పోటీలు కొత్త అయినప్పటికీ, ఏమాత్రం జంకకుండా తనదైన శైలిలో ప్రతిభ కనబరిచి భారత్‌కు తృతీయ బహుమతి సాధించి పెట్టాడు. అక్కడ వచ్చే ఏడాది ప్రపంచ స్థాయి పోటీలకు ఎంపిక జరగగా చరణ్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.
మేనమామ ప్రోత్సాహంతో..
చరణ్ శ్రీకాకుళం జిల్లా పలాసకు సమీపంలోని అంతరగుడ్డి గ్రామం అయినప్పటికీ, 87వ వార్డులోని కణితి కాలనీలోని తన మేనమామ దానప్పలు వద్ద పెరుగుతూ ఉక్కునగరంలో చదువుతున్నాడు. మేనమామ ప్రోత్సాహంతో వాలీబాల్‌లో రాణిస్తున్నాడు. ఇటీవలే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. ఒకవైపు చదువుతూనే మరోవైపు క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ అందులో కూడా మంచి ప్రతిభ చూపుతుండటం పట్ల పలువురు అభినందిస్తున్నారు. చరణ్ తల్లిదండ్రులు కమలనాభం, దేవీలు తమ సొంత ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
జంపింగ్ స్కిల్స్ సూపర్
మొదట్లో చరణ్‌కు శిక్షణ ఇవ్వడానికి కొంతమేర అంగీకారం తెలపలేదు. అయితే తల్లి దండ్రులు, మేనమామ ప్రొత్సాహాన్ని చూసి అంగీకరించాం. చరణ్‌లో జంపింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి. అవి గుర్తించిన తరువాత శిక్షణ మరింత పకడ్బందీగా ఇచ్చా. తాము అనుకున్నట్టుగానే బాగా రాణించాడు. జాతీయ స్థాయిలో రాణించాడు.
– ఎం.సత్యనారాయణ, వాలీబాల్ కోచ్

16 ఏళ్ల కుర్రోడు.. సత్తాచాటాడు

16 ఏళ్ల కుర్రోడు.. సత్తాచాటాడు