
మరింత పటిష్టంగా.. సీబీఎస్‌ఈ విద్య
● ఎన్‌ఈపీ–2020 నిబంధనలకు అనుగుణంగా బోధన ● సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ప్రత్యేక భద్రతా చర్యలు ● 2026 నుంచి ఏటా రెండు సార్లు బోర్డు పబ్లిక్ పరీక్షలు ● జిల్లాలో 40 సీబీఎస్‌ఈ స్కూళ్లు, 39,517 మంది విద్యార్థులు ● నూతన మార్గదర్శకాలు జారీ చేసిన సీబీఎస్‌ఈ బోర్డు
ఆరిలోవ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) విద్యను మరింత పటిష్టవంతం చేస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్‌ఈపీ)–2020 మేరకు సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి నియమ నిబంధనలపై జిల్లాలోని సీబీఎస్‌సీ స్కూళ్ల యాజమాన్యాలకు బోర్డు సమాచారం అందించింది. ఈ నిబంధనల మేరకు విద్యార్థుల భద్రత కోసం ప్రతి పాఠశాలలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. పాఠశాల ప్రధాన ద్వారం, క్రీడా మైదానం, కారిడార్లు, తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వాటిలో ఆడియో, వీడియో స్పష్టత ఉండాలి. ప్రతి తరగతి గదిలో 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. మంచి గాలి, వెలుతురు వచ్చేలా తరగతి గదుల్లో సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు.
ఏటా రెండుసార్లు పరీక్షలు
నూతన విధానం ప్రకారం సీబీఎస్‌ఈ బోర్డు ద్వారా 2026 నుంచి పదో తరగతి పరీక్షలు రెండుసార్లు నిర్వహించనున్నారు. ఇంతవరకు ఒకసారి మాత్రమే పబ్లిక్ పరీక్షలు జరిగేవి. ఇప్పుడు విద్యార్థులు మార్కులు మెరుగు పరచుకునేందు(బెటర్‌మెంట్)కు అవకాశం కల్పిస్తూ రెండుసార్లు పరీక్షలు నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చారు. రెండోసారి పరీక్ష రాయాలనుకునే విద్యార్థి మొదటి సారి పరీక్ష తప్పనిసరిగా రాసి ఉండాలి. ఈ విధానం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. దీంతో పాటు పరీక్ష పేపర్‌లో కూడా మార్పులు తీసుకొచ్చారు. ప్రశ్నాపత్రంలో స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలను బోర్డు తగ్గించింది. ఆలోచన, నైపుణ్యం కలిగించే విశ్లేషణాత్మక, వివరణాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. దీనివల్ల భావాలను అర్ధంచేసుకునేలా విద్యార్థి తీర్చిదిద్దబడతాడని బోర్డు నమ్మకం.
జిల్లాలో 40 సీబీఎస్‌ఈ స్కూళ్లు
విశాఖ జిల్లాలో 40 సీబీఎస్‌ఈ పాఠశాలలున్నాయి. వాటిలో టింపనీ, విశాఖ వ్యాలీ, జవహర్ నవోదయ, ఓక్రిడ్జ్, ఎస్‌ఎఫ్‌ఎస్, సెయింట్ ఆన్స్, డిపాల్, శ్రీచైతన్య, నారాయణ, కేకేఆర్ గౌతం తదితర పాఠశాలలు ఉన్నాయి. వాటిలో రెండు ప్రైమరీ, ఒక అప్పర్ ప్రైమరీ పాఠశాలతో పాటు 37 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 39,517 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో ఆయా పాఠశాలలన్నీ తప్పనిసరిగా సీబీఎస్‌ఈ నూతన విధానాల మేరకు భద్రతా చర్యలు పాటించాలని బోర్డు స్పష్టం చేసింది.