
ఆరోగ్య శ్రీపై నీలినీడలు
● ఆస్పత్రులకు బిల్లులు చెల్లించని కూటమి ప్రభుత్వం ● జిల్లాలో 106 ఆస్పత్రులకు రూ.260 కోట్ల మేర బకాయిలు ● పేదలకు అందని ‘ఆరోగ్యశ్రీ’ వైద్యం
మహారాణిపేట: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై కూటమి ప్రభుత్వం ‘సవతి తల్లి ప్రేమ’ చూపుతోంది. ప్రైవేటు ఆసుపత్రులకు కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్‌లో పెట్టడంతో, పేద రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు, వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ కార్డులకు వైద్యసేవలు అందించడంలో కార్పొరేట్ ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదు.
పేదలపై కూటమి సర్కార్ కత్తి
ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలపై హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న పథకాలను ఎత్తేసే ప్రయత్నం చేస్తోంది. మద్యం విక్రయాలు, విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం, దివంగత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం చేసేందుకు దృష్టి సారించిందని ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లాలో పరిస్థితి
జిల్లాలో 106 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్నాయి. ఈ నెట్‌వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ. 260 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే పేదల ఆరోగ్యశ్రీ వైద్య సేవల్లో అంతరాయం కలుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో అద్భుతమైన సేవలు అందించిన కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పుడు కార్డుదారులకు సేవలు అందించడానికి వెనుకాడడంతో, లబ్ధిదారుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.
కార్డుదారులందరికీ వైద్యం
ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న అందరికీ వైద్య సేవలు అందుతున్నాయని, ఎక్కడైనా సేవలు అందకపోతే తమను సంప్రదించాలని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ అప్పారావు కోరారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.