
సమస్యలు పరిష్కరించకుంటే ఆత్మహత్యలే శరణ్యం
మంత్రి ఎదుట రోగి మిత్రల ఆవేదన
మహారాణిపేట: కేజీహెచ్‌లో రోగి మిత్రలుగా విధులు నిర్వర్తించిన కొందరు, ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్‌సోర్సింగ్ (ఆప్కోస్) సర్వీసెస్‌లో చేర్చుతామని తమ వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ సోమవారం పీజీఆర్‌ఎస్‌లో రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్‌కు, కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు రోగిమిత్రలు వినతిపత్రాలు అందజేశారు. 2012 నుంచి కేజీహెచ్‌లో రోగి మిత్రలుగా పనిచేస్తున్నామని, నెలకు రూ.3,800 నుంచి రూ. 6,000 మధ్య వస్తున్న జీతం సరిపోవడం లేదని పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినట్లు వారు తెలిపారు. అయితే ఆరోగ్యశ్రీలో నిధులు లేవని చెప్పి తమను విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. ఇదే సమయంలో కేజీహెచ్‌కు అధికారి సత్యనారాయణ.. ఆప్కోస్‌లో కలిపి జీతాలు పెంచుతామని చెప్పి తమ నుంచి రూ. 20 వేల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారని రోగి మిత్రలు వాపోయారు. ఎంప్లాయిమెంట్ అధికారి సాంబిరెడ్డి, కేజీహెచ్ అధికారి సత్యనారాయణ డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన చెందారు. ఈ విషయంపై గత నెల 20న పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించగా, కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే విచారణ చేస్తున్న అధికారులతో సదరు అధికారికి మంచి సంబంధాలు ఉన్నాయని..విచారణపై తమకు నమ్మకం లేదని రోగి మిత్రలు స్పష్టం చేశారు. ఈ విచారణ వల్ల న్యాయం జరగదని, నిజాయతీ అధికారులను విచారణకు నియమిస్తేనే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని వారు కోరారు. కోవిడ్, హుద్‌హుద్ వంటి విపత్కర సమయాల్లో రోగి మిత్రలుగా ఎన్నో సేవలు అందించామని, నేడు ఉద్యోగాలు పోయి, డబ్బులు కట్టి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోగి మిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.