
రౌడీ షీటర్‌పై దాడి చేసిన నిందితులకు రిమాండ్
మరో ఆరుగురి కోసం గాలింపు
ఉక్కునగరం: మూడు రోజుల క్రితం స్టీల్‌ప్లాంట్ బీసీ గేటు సమీపంలోని లారీ యార్డ్ వద్ద రౌడీ షీటర్‌పై జరిగిన దాడి కేసులో ఆరుగురు నిందితులను స్టీల్‌ప్లాంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. దేశపాత్రుని పాలెం సమీపంలోని స్నేహపురి కాలనీకి చెందిన రౌడీ షీటర్ మొల్లి సంతోష్‌కుమార్ (37) ఈ నెల 25న తన కుమార్తెను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్లాడు. అక్కడ ఆలస్యం అవుతుండటంతో, స్టీల్‌ప్లాంట్ బీసీ గేటు సమీపంలోని లారీ యార్డ్ వద్ద తన సోదరుడు సతీష్, స్నేహితుడు గణేష్‌తో కలిసి మాట్లాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పెదగంట్యాడకు చెందిన మొల్లి శివకృష్ణ, మొల్లి శ్రీను, బాక్సర్లు వాసు మీసాల రవి, వియ్యపు ప్రవీణ్ మరికొంతమందితో అక్కడికి చేరుకుని సంతోష్‌కుమార్‌పై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. సంతోష్‌కుమార్ అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలోని పొదల్లో దాక్కున్నాడు. ఈ దాడిలో మొల్లి శివకృష్ణ, మొల్లి శ్రీను కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అనుచరులని తెలుస్తోంది. దాడి అనంతరం సంతోష్‌కుమార్ ఎస్వీఎస్ పాలీ క్లినిక్‌లో ప్రాథమిక చికిత్స చేయించుకుని, ఆ తర్వాత అగనంపూడి ఆస్పత్రికి వెళ్లాడు. మరుసటి రోజు అతను స్టీల్‌ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఈ ఘటనలో పాల్గొన్న మొల్లి శివకృష్ణ, రవి, ప్రవీణ్, జి. మనోజ్ కుమార్, ముచ్చి తరుణ్ అలియాస్ తేజ, సిరసపల్లి జితేంద్ర కుమార్‌లను అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందన్నారు. దాడిలో పాలుపంచుకున్న మరో ఆరుగురిని గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశంలో స్టేషన్ సీఐ ఈ. కేశవరావు కూడా పాల్గొన్నారు.