
తిలా పాపం.. తలా పిడికెడు
గాజువాక : పెదగంట్యాడలోని విశాఖ విమల విద్యాలయం (వీవీవీ) క్యాంపస్‌లో ఇంగ్లిష్ టీచర్ మల్లాది రవి మోహన్ నిమోనియాతో మరణించడం ఆ పాఠశాల ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన రేపింది. ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో రవి మోహన్ సకాలంలో సరైన వైద్యం చేయించుకోలేకపోయారని ఆయన సహోద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య ఖర్చులు భరించలేక చివరికి కేజీహెచ్‌లో చేరి..అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పెదగంట్యాడలో వీవీవీ నడుస్తున్పటికీ అక్కడ జీతాలు ఇవ్వడం లేదు..ప్రధాన క్యాంపస్ ఉక్కునగరంలో ఉంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో ఈ పాఠశాలను మాజమాన్యం మూసివేసింది. దీని ఫలితంగా దశాబ్దాల కాలంగా పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు నిలిపివేశారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పాఠశాల కొనసాగింపు, జీతాల చెల్లింపు కోసం ఉపాధ్యాయులు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను ఇటీవల ఉపాధ్యాయులు కలిశారు. అయితే పాఠశాల కొనసాగింపుపై స్పందించని ఆ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులకు వీఆర్‌ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) ఇచ్చి పంపించేయాలని సిఫార్సు చేస్తూ లేఖలు ఇవ్వడం ఉపాధ్యాయులను నివ్వెరపరిచింది. ఈ లేఖలు రవి మోహన్‌లాంటి ఉపాధ్యాయులకు అశనిపాతంగా మారాయని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ పాఠశాల చరిత్ర : సుమారు నాలుగు దశాబ్దాల క్రితం విశాఖ విమల విద్యాలయం ప్రారంభమైంది. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లల విద్యావసరాలను తీర్చడానికి ఈ తెలుగు మీడియం పాఠశాలను స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం స్థాపించింది. దీని నిర్వహణ బాధ్యతలను నగరంలోని డయాసిస్ సంస్థకు అప్పగించారు. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు చెల్లించేవారు. ప్రతి సంవత్సరం సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రస్తుతం, పాఠశాలలో 28 మంది శాశ్వత ఉపాధ్యాయులు, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, మరియు 60 మంది ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. పాఠశాల నిర్వహణకు ఏటా దాదాపు రూ. 5 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో రూ. 2 కోట్లు ఫీజుల రూపంలో వసూలవుతాయి, మిగిలిన మొత్తాన్ని ఉక్కు యాజమాన్యం అందిస్తుంది.
జరుగుతున్న కథ ఇది.. : ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయం సంక్షోభంలో కూరుకుపోయింది. జీతాలు లేక ఇంగ్లీష్ టీచర్ మల్లాది రవి మోహన్ నిమోనియాతో మృతి చెందడం పరిస్థితిని మరింత దిగజార్చింది. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం పాఠశాల నిర్వహణకు నిరాకరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పాఠశాలను తిరిగి తెరవాలని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వీఆర్‌ఎస్ సిఫార్సు లేఖలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రవి మోహన్ మృతికి జీతాల బకాయిలే కారణమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీవీవీ ఉపాధ్యాయుడి మృతికి
బాధ్యులెవరు?
ఆరు నెలలుగా జీతాల్లేక.. సకాలంలో వైద్యం చేయించుకోలేని ఉపాధ్యాయుడు
మల్లాది రవిమోహన్
మృతితో ఉపాధ్యాయుల్లో ఆందోళన

తిలా పాపం.. తలా పిడికెడు