
కవి ప్రధాన లక్ష్యం సమాజ శ్రేయస్సు
తాటిచెట్లపాలెం: తెలుగు సాహిత్య అభిమానులకు, కవితా ప్రకటనకు శ్రీశ్రీ కళావేదిక ఒక గొప్ప వేదికగా నిలుస్తోందని శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కట్టిమండ ప్రతాప్ అన్నారు. సంస్థ జిల్లా అధ్యక్షుడు కొలిచిన రామ జగన్నాథ్ ఆధ్వర్యంలో ఆదివారం రైల్వేస్టేషన్ సమీపంలోని శుభం ఫంక్షన్ హాల్‌లో సంస్థ 150వ సాహిత్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రతాప్ మాట్లాడుతూ కవి ప్రధాన లక్ష్యం సమాజ శ్రేయస్సు కోరుకోవడమేనన్నారు. ఈ కాలంలో కవిత్వం ప్రజల మనోభావాలకు ప్రతినిధిగా నిలవాలని, సమాజంలో మార్పుకు దారితీసే శక్తిగా సాహిత్యం ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వభారత్ డైరెక్టర్ బలివాడ రమేష్ మాట్లాడుతూ వచ్చే సంక్రాంతికి విజయనగరం జిల్లా గరివిడిలో శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు బహుభాషా కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమ్మేళనంలో విశాఖ నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 150 మంది కవులను ప్రశంసాపత్రం, శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. సమకాలీన రాజకీయాలు, మానవతా విలువలు, ప్రకృతి సంరక్షణ, మహిళా సాధికారత వంటి విభిన్న అంశాలపై కవులు తమ కవితలు వినిపించారు.