బ్లాక్‌ చేసేశారు..! | - | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ చేసేశారు..!

Jul 28 2025 7:09 AM | Updated on Jul 28 2025 7:09 AM

బ్లాక్‌ చేసేశారు..!

బ్లాక్‌ చేసేశారు..!

ఉక్కు కార్మికుల్ని

మూడు దశాబ్దాలుగా ఆ పరిశ్రమనే నమ్ముకున్నారు. ఉక్కుతోనే జీవితం అని భావించారు. అర్థాంతరంగా వారిని జీవన కర్మాగారం నుంచి దూరం చేసేశారు. దీంతో నాలుగు వేల మంది కార్మికులు కుటుంబాలతో రోడ్డున పడ్డారు. దేశంలో ఏ పరిశ్రమలోనూ లేని విధంగా మరోసారి ప్లాంట్‌లో అడుగుపెట్టనీయకుండా కార్మికులకు ‘ఆధార’ం దొరక్కుండా ‘బ్లాక్‌’ చేసేశారు. ప్లాంట్‌ మనుగడ కోసమే కార్మికులను తొలగించామని చెబుతున్న యాజమాన్యం.. వారి స్థానంలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి నియమించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సాక్షి, విశాఖపట్నం : ఓవైపు ఉక్కు పరిశ్రమను ఉద్ధరిస్తామంటూ చంద్రబాబు సర్కారు ఊదరగొడుతూ.. మరోవైపు సంస్థను మరింత కుంగదీసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి కుయుక్తులు పన్నుతోంది. ఇప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న స్టీల్‌ప్లాంట్‌.. ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. ఏకంగా 305 శాతం జీతాలు బకాయిలుగా ఉంచేసి.. ఉద్యోగుల ఆర్థిక స్థితిని అగమ్యగోచరంగా మార్చేసింది. ఇప్పటికీ సీనియర్లకు 75 శాతం, మధ్యస్థ ఉద్యోగులకు 80 శాతం వేతనం మాత్రమే చెల్లిస్తోంది. ఓవైపు కేంద్ర గనుల శాఖ మంత్రి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని బాహాటంగా చెబుతుంటే.. మరోవైపు ప్లాంట్‌ను నిర్వీర్యం చేసే పనులను కూటమి ప్రభుత్వం చాపకింద నీరులా చేసుకుంటూ పోతోంది. ఇటు ప్రజలు.. అటు ఉద్యోగుల ఆందోళనలు.. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా.. వెరవకుండా ఏళ్లతరబడి ఉద్యమాలు చేసి.. స్టీల్‌ప్లాంట్‌ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఆర్థిక మూలాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బకొడుతున్నాయి. పోరాటం చేస్తున్న వారి ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక ఆసరాని ఛిద్రం చేస్తే.. ఉద్యమాన్ని నీరుగార్చొచ్చన్న కుతంత్రంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విషయం.. జీతాల చెల్లింపులతో బట్టబయలవుతోంది. దీనికి తోడు కాంట్రాక్టు కార్మికులపైనా వేటు వేసింది. కొద్ది నెలల క్రితం ఏకంగా 4 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను అర్థాంతరంగా తొలగించేసి నడిరోడ్డున పడేసింది. 30 శాతం కాంట్రాక్టు కార్మికులను తక్షణం విధుల నుంచి వెనక్కి పంపుతూ వారి గేట్‌పాస్‌లను వెనక్కి తీసుకుంది. దీనిపై కాంట్రాక్టు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా యాజమాన్యం మరింత కఠినంగా వ్యవహరించింది.

ఇతర రాష్ట్రాల కార్మికులెందుకో.?

కాస్ట్‌ కటింగ్‌ పేరుతో కార్మికుల తొలగింపు చేపట్టిన ప్లాంట్‌.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను దిగుమతి చేసుకోవడంపై సర్వత్రా మండిపడుతున్నారు. తొలగించిన వారి స్థానంలో స్కిల్డ్‌ కార్మికులు లేక.. ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుండటంతో ఏం చేయాలో పాలుపోక.. ఒడిశా, చత్తీస్‌గడ్‌ నుంచి కాంట్రాక్టు కార్మికుల్ని నియమించుకోవాలంటూ ఏజెన్సీల్ని ప్లాంట్‌ ఆదేశించింది. ఇప్పటి వరకూ 1000 మందికి పైగా కార్మికుల్ని ఈ రెండు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి.. ప్లాంట్‌లో ఉపాధి కల్పించారు. దీనిపైనా ఉద్యోగ, కార్మిక సంఘాలు యాజమాన్యంతో పోరాటం సాగిస్తున్నా.. పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాంట్‌ యాజమాన్య వ్యవహార శైలిపై కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు చివరికి సీఎం, డిప్యూటీ సీఎంకి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా ప్లాంట్‌నే నమ్ముకొని.. కుటుంబాలను నడిపించిన వారంతా.. వేరే పని తెలియక.. కుటుంబాల్ని పోషించుకోలేక అల్లాడిపోతున్నారు. వీరికి న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాకపోవడంపై కార్మిక సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్టీల్‌ప్లాంట్‌లో అడుగు పెట్టనీయకుండా కుట్ర

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధార్‌ కార్డ్‌ బ్లాక్‌

ఏ ఏజెన్సీలోనూ పనిచేయనీయకుండా ఆంక్షలు

4 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను రోడ్డున పడేసిన యాజమాన్యం

కొత్తగా ఒడిశా, జార్ఖండ్‌కు చెందిన వెయ్యి మందికిపైగా ఉపాధి కల్పన

మండిపడుతున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు

ఆధార్‌ కార్డూ బ్లాక్‌లో పెట్టేశారు.!

అన్‌ఫిట్‌గా లేరని కొందర్ని.. పనిరాదంటూ మరికొందర్ని తొలగించడంతో 4 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పైగా కార్మిక, ఉద్యోగుల సంఘాల నాయకులు ఆందోళన చేస్తుండటంతో ప్లాంట్‌ యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శించింది. స్టీల్‌ప్లాంట్‌లో గల దాదాపు 600 ఏజెన్సీల్లో కొంతమంది చొప్పున వేటు వేసింది. బయోమెట్రిక్‌లో పేరు తొలగించేసింది. పైగా వీరందరి ఆధార్‌ కార్డులను బ్లాక్‌ చేయాలంటూ ప్లాంట్‌ యాజమాన్యం ఏజెన్సీలను ఆదేశించింది. దీంతో వారు మరో ఏజెన్సీలో చేరి ప్లాంట్‌లోకి ప్రవేశించడానికి వీలు లేకుండా చేసేసింది. అంటే ఈ 4 వేల మందికీ ప్లాంట్‌లో పని దొరికే అవకాశం లేదు. దేశంలో ఏ పరిశ్రమలోనూ ఈ తరహా నిరంకుశ వైఖరి లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement