
రైతు బజార్లపై ‘కూటమి గద్దలు’!
● 100 డ్వాక్రా, దివ్యాంగుల స్టాళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం ● విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి 350 దరఖాస్తులు ● కూటమి నేతల వసూళ్ల పర్వం ● చక్రం తిప్పుతున్న ఓ ఎమ్మెల్యే పీఏ ● సిఫార్సులతో అధికారుల మల్లగుల్లాలు
విశాఖ విద్య : రైతు బజార్లపై కూటమి నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. నగరంలోని రైతుబజార్లలో త్వరలో కేటాయించబోయే స్టాళ్లను చేజిక్కించుకునేలా తమ అనుచరులను రంగంలోకి దింపారు. వీటిని తమ వ్యాపార కేంద్రాలుగా మార్చేందుకు కూటమి నేతలు రాజకీయం చేస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో 13 రైతు బజార్లు ఉన్నాయి. వీటిలో 1,350 వరకు స్టాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో డ్వాక్రా, దివ్యాంగులకు 220 స్టాళ్లు కేటాయించారు. ఇక్కడ దుకాణాల నిర్వహణకు విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 2 వేలు కార్డులు జారీ చేశారు. మరో ఏడు వందల మందికి పైగా తమకు దుకాణాలు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. రైతు కార్డులకు శాశ్వత గుర్తింపు ఉండగా, డ్వాక్రా, దివ్యాంగులకు మూడేళ్ల కాలవ్యవధితో దుకాణాల నిర్వహణకు అవకాశం కల్పిస్తారు.
100 స్టాళ్లకు నోటిఫికేషన్
జిల్లాలో అన్ని రైతుబజార్లలో డ్వాక్రా, దివ్యాంగులకు సంబంధించి 98 స్టాళ్లు, కొత్తగా ఏర్పాటు చేసిన చిట్టివలస రైతు బజారులోని 2 స్టాళ్లు కలుపుకొని మొత్తంగా 100 స్టాళ్లు(డ్వాక్రా–71, దివ్యాంగులు–29) నిర్వహణకు (మూడేళ్లు వ్యవధితో కార్డుల జారీ) ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేశారు. గడువు ఈ నెల 31తో ముగియనుండగా ఇప్పటివరకు 350 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో లాటరీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది.
భారీగా చేతులు మారుతున్న డబ్బులు
రైతు బజారులో దుకాణాల నిర్వహణ లాభసాటిగా ఉంటుంది. సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, కంచరపాలెం వంటి చోట్ల ఒక్కో స్టాల్‌లో రోజుకు రూ.30 వేలు పైనే అమ్మకాలు సాగుతాయి. గోపాలపట్నం, గాజువాక, పెదవాల్తేరు, స్టీల్‌ప్లాంట్, పెందుర్తి, మధురవాడ వంటి రైతుబజార్లలో తాము చెప్పిన వారికి స్టాల్ దక్కేలా కూటమి నేతలు స్కెచ్ వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. విశాఖ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు(పీఏ) గోపాలపట్నంలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలోనే తిష్టవేసి.. ఈ తతంగాన్ని నడిపిస్తున్నానే ప్రచారం సాగుతోంది. ఇందుకు భారీగా డబ్బులు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమలాంటి వారికి అవకాశం దక్కకుండా కూటమి నాయకులు కుయుక్తులు పన్నుతుండటంపై దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
సిఫార్సుల వడపోత
లాటరీ ప్రక్రియకు ముందే దరఖాస్తుదారుల్లో అర్హులెవరెనేది నిశిత పరిశీలన చేయాల్సి ఉంది. బైలా ప్రకారం మనుగడలో ఉన్న డ్వాక్రా సంఘాలనే పరిగణలోకి తీసుకోవాలి. పరిశీలన నిమిత్తం మార్కెటింగ్ శాఖ అధికారులు, అనకాపల్లి డీఆర్‌డీఏ అధికారులకు 143, విశాఖ డీఆర్‌డీఏ అధికారులకు 40, జీవీఎంసీలోని యూసీడీ విభాగానికి 167 దరఖాస్తులను పంపించారు. ఇక్కడ నుంచే పైరవీల జాతర మొదలైందనే ప్రచారం సాగుతోంది. తమ అనుచరుల పేర్లు మాత్రమే లాటరీలో ఉండేలా వడపోత సాగాలని కూటమి నేతలు సిఫార్సు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.