మాట వినకుంటే వేటే..! | - | Sakshi
Sakshi News home page

మాట వినకుంటే వేటే..!

Jul 28 2025 7:09 AM | Updated on Jul 28 2025 7:09 AM

మాట వినకుంటే వేటే..!

మాట వినకుంటే వేటే..!

● అంచనాలు లేకుండా పోల్స్‌, ట్రాన్స్‌ఫార్మర్లు మార్చాలంటూ ఎమ్మెల్యే హుకుం ● ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే చేసేస్తామన్న ఏఈ, ఏడీఈ ● వారిని వెంటనే బదిలీ చేయించి.. తనకు అనుకూలంగా ఉన్న వారికి పోస్టింగ్‌

ఈపీడీసీఎల్‌ చిరుద్యోగులపై టీడీపీ ఎమ్మెల్యే ప్రతాపం

ఆగమేఘాలపై ఏఈ, ఏడీఈల బదిలీ

సాక్షి, విశాఖపట్నం : ‘ఇది నా నియోజకవర్గం.. నేను చెప్పిందే అంచనా.. నేను చెప్పిందే పని.. అడ్డొస్తే.. ఇక్కడ ఉండరు. జాగ్రత్త..’ ఈపీడీసీఎల్‌ ఉద్యోగులపై ఓ కూటమి సీనియర్‌ ఎమ్మెల్యే రుబాబిది. హెచ్చరించినట్లుగానే.. చిరుద్యోగులపై తన ప్రతాపాన్ని చూపించారు. తాను చెప్పినట్లు వినలేదని ఇద్దరు ఉద్యోగులను ఆగమేఘాల మీద బదిలీ చేయించి.. తనకు నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇప్పించేసుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన తన దగ్గర నిబంధనలు పనిచేయవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సదరు ఎమ్మెల్యే వ్యవహారశైలితో ఆ ప్రాంతంలో పనిచేసేందుకు ఈపీడీసీఎల్‌ ఉద్యోగులు జంకుతున్నారు.

ఎమ్మెల్యే ఆగ్రహానికి ఏఈ, ఏడీఈ బలి..!

ఇటీవల తన నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు విద్యుత్‌ లైన్‌ వెంటనే మార్చాలని ఈపీడీసీఎల్‌ ఏఈ, ఏడీఈలను ఆదేశించారు. ఎస్టిమేషన్స్‌ సిద్ధం చేస్తామని వారు చెప్పారు. కానీ ఎమ్మెల్యే వినిపించుకోకుండా ప్రజల ముందరే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత రోజు ఒక వీధిలో పోల్స్‌ సాయంత్రానికల్లా మార్చాలని ఆదేశించారు. ఇది కూడా వెంటనే చేయడం సాధ్యం కాదనీ.. అంచనాలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని.. అక్కడి నుంచి అనుమతి రాగానే మార్చేస్తామని సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఈగో హర్ట్‌ అయ్యింది. నేను చెప్పినా.. అంచనాలు గించనాలు అని సమాధానమిస్తారా అంటూ సదరు ఏఈ, ఏడీఈపై చిందులేశారు. నా మాట లెక్క చెయ్యని మీరు.. ఇక్కడెలా ఉంటారో చూస్తానంటూ హెచ్చరించారు. అక్కడి నుంచే ఈపీడీసీఎల్‌ ఉన్నతాధికారితో ఫోన్‌లో మాట్లాడి.. ఏఈ, ఏడీఈల్ని సాయంత్రానికల్లా ట్రాన్స్‌ఫర్‌ చేయాలని ఆర్డర్‌ వేశారు. నేను ఏం చెబితే.. అది చేసే ఏఈ, ఏడీఈ పేర్లు మీకు మెసేజ్‌ చేస్తున్నా.. వారికి పోస్టింగ్‌ కూడా ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఇంకేముంది అక్కడ ఎవరిది తప్పో కనీసం విచారణ చేపట్టకుండా.. ఏఈ, ఏడీఈ వెర్షన్‌ తెలుసుకోకుండా.. విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారి.. బదిలీ ఆర్డర్‌ వారి చేతిలో పెట్టేశారు. ఎమ్మెల్యే చెప్పిన వారిని అక్కడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసేశారు.

వామ్మో.. ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలోనా.?

సదరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో పనిచేయాలంటే విద్యుత్‌ ఉద్యోగులు భయపడుతున్నారు. లైన్‌మెన్‌ దగ్గర నుంచి.. పై స్థాయి ఉద్యోగి వరకూ ఎవరైనా.. ఆయన ఏ పని చెబుతారోనంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం తమ వల్ల కాదని చెప్పేవాళ్లకు బదిలీ ఆర్డర్‌ని చేతిలో పెడుతున్నారు. అయితే.. కొత్తగా విధుల్లో చేరిన ఇద్దరు ఉద్యోగులూ ఎమ్మెల్యేకు వీర విధేయులే అయినా.. అడ్డగోలుగా పనులు ఎలా చేసేస్తారో చూస్తామని తోటి ఉద్యోగులే వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement