
విప్లవోద్యమానికి తొలి గొంతుక చలసాని
సీతంపేట : కామ్రేడ్ చలసాని ప్రసాద్ మనుషుల పట్ల అచంచలమైన ప్రేమ, ఆప్యాయత చూపేవారని, ఆయన జీవితం మొత్తం విప్లవ పంథాలోనే ముగించారని పలువురు వక్తలు కొనియాడారు. విరసం వ్యవస్థాపకుడు చలసాని ప్రసాద్ పదో వర్ధంతి సభ ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. చలసాని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎస్సార్ ప్రసాద్ మాట్లాడుతూ మనసు ఫౌండేషన్ డిజిటలైజేషన్‌కు పాఠకులు ఎవరైనా వెళ్లి తమకు నచ్చిన పుస్తకం చదవొచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విరసం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ చలసాని సేకరించిన సుమారు 8,500 పుస్తకాలను మనసు ఫౌండేషన్ స్కాన్‌చేసి డిజిటలైజేషన్ చేయడం సిపిబుక్స్.ఓఆర్‌జి వెబ్‌సైట్‌లో పొందుపర్చడం, ఆ వెబ్‌సైట్‌ను నా చేతుల మీదుగా ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా శాంతి చర్చలు, విప్లవ పంథా పేరిట సదస్సు నిర్వహించారు. చలసాని జీవితం తాత్వికతపై ప్రజాస్వామ్య రచయితల వేదిక నాయకురాలు మల్లీశ్వరి ప్రసంగించారు. కవి బాలసుధాకర్ రాజకీయార్థిక సంక్షోభం నేపథ్యంలో యాభై ఏళ్ల కళింగాంధ్ర కవితపై ప్రసంగించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, పీవోడబ్ల్యూ లక్ష్మి, మధు, వేణుమాస్టర్, టి.శ్రీరామమూర్తి, ప్రసాదవర్మ, మానం ఆంజనేయులు, లలిత, చందు సుబ్బారావు, కత్తి పద్మ, ఇప్టూ ప్రసాద్ మాట్లాడారు.