
అపరిశుభ్రత, అసౌకర్యాలు
జిల్లాలోని మొత్తం 55 ప్రభుత్వ వసతి గృహాల్లో సగానికి పైగా అసౌకర్యాలతో నిండి ఉన్నాయని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. 30 బీసీ వసతి గృహాలలో సగానికి పైగా అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. ఈ భవనాలకు దశాబ్దాలుగా మరమ్మతులు చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. కొన్ని చోట్ల నీరు బ్లీచింగ్ వాసన వస్తోందని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థులు కటిక నేలపై, కొన్ని చోట్ల దుప్పట్లు/ప్లెక్సీలు పరచుకుని నిద్రపోతున్నారు. కొన్ని చోట్ల మంచాలు, దుప్పట్లు వంటివి అందుబాటులో లేవు. ఆహారంలో నాణ్యత లోపించడం, సమయానికి ఆహారం సిద్ధం కాకపోవడం వల్ల విద్యార్థులు అర్ధాకలితోనే చదువులు కొనసాగిస్తున్నారు. అవసరమైన వైద్య వసతులు, బాలికలకు అవసరమైన కిట్లు కూడా ప్రభుత్వం అందించడం లేదు. ఇక వసతి గృహాల పరిసరాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. విద్యార్థులు తమ దైనందిన కార్యకలాపాలు సాగిస్తున్న గదుల్లో ఫ్లోరింగ్ మరమ్మతులకు గురైంది. విద్యార్థులు తమ వస్తువులను భద్రపరచుకునే పెట్టెలను ఈ పగిలిన ఫ్లోరింగ్ పక్కనే ఉంచుకుంటున్నారు. తోటగరువులోని హాస్టల్‌లో 122 మంది విద్యార్థులు కేవలం 120 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు గదుల్లో వసతి పొందుతున్నారు. ఫిబ్రవరి నుంచి విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు అందడం లేదు. ఇలా విద్యార్థులు ఉన్న సౌకర్యాలతోనే దయనీయంగా చదువులు కొనసాగిస్తున్నారు.

అపరిశుభ్రత, అసౌకర్యాలు