
సమష్టి కృషితోనే జీవీఎంసీకి గుర్తింపు
మహారాణిపేట: పారిశుధ్య కార్మికుల సమష్టి కృషితోనే సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ ప్రత్యేక కేటగిరీలో జీవీఎంసీకి ప్రథమ స్థానం దక్కిందని మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఏయూ కన్వెన్షన్‌లో జీవీఎంసీ నిర్వహించిన స్వచ్ఛ అవార్డుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిన పారిశుధ్య కార్మికులకే ఈ అవార్డు దక్కుతుందన్నారు. జీవీఎంసీ పరిధిలో పారిశుధ్య కార్మికులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ మంచి టెక్నాలజీని అందిపుచ్చుకొని విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలన్నారు. కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ అందరూ కలిసి పని చేస్తే మరిన్ని అవార్డులు జీవీఎంసీకి దక్కుతాయని పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ కష్టపడి పనిచేయడం వల్ల జీవీఎంసీకి స్వచ్ఛతలో మొదట ర్యాంకు వచ్చిందన్నారు. పారిశుధ్య కార్మికులు, కార్యదర్శులు, యూసీడీ సిబ్బంది, పలు ఎన్‌జీవోలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లను సత్కరించి స్వచ్ఛ అవార్డులను, ప్రశంసా పత్రాలను జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద రాజు, ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జి, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, వీఎంఆర్‌డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మ, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, యూసీడీ పీడీ సత్యవేణి, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ పీలా శ్రీనివాసరావు