
ఉద్యోగే దొంగ
● భారీ చోరీ కేసును ఛేదించిన ద్వారకా పోలీసులు
● రూ.1,29,48,154 విలువైన చోరీ సొత్తు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన సీపీ శంఖబ్రత బాగ్చి
తాటిచెట్లపాలెం: ఒక డైమండ్స్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న ఉద్యోగి.. యజమాని నమ్మకాన్ని దుర్వినియోగం చేసి ఆభరణాలను దొంగిలించాడు. ద్వారకా పోలీసులు ఈ భారీ చోరీ కేసును ఛేదించి.. ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,29,48,154 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన వివరాలివి. హైదరాబాద్‌కు చెందిన బొంగు వంశీ.. అక్కడి క్రిష్ డైమండ్స్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఇదే షోరూంలో ఆరు నెలల కిందట హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ముదపాక జేజి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. షోరూంలో తయారైన వివిధ రకాల డైమండ్ మోడళ్లను విశాఖ తీసుకొచ్చి.. ఇక్కడి దుకాణ యజమానులకు వాటిని చూపించి ఆర్డర్‌లు తీసుకువెళ్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 2న క్రిష్ డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ అగర్వాల్ 883.814 గ్రాముల 18 క్యారెట్స్ బంగారం, డైమండ్ ఆభరణాలు, 22.881 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం, డైమండ్స్ ఆభరణాలు(మొత్తం 906.695 గ్రాములు.. వీటి విలువ రూ.1,29,48,154.62) ఇచ్చి.. బొంగు వంశీని, ముదపాక జేజిని విశాఖ పంపించారు. వీరు ఈ నెల 2న హైదరాబాద్‌లో బయలుదేరి 3న విశాఖ చేరుకున్నారు. ఎప్పటిలాగే లలితా జ్యువెలరీ ఎదురుగా ఉన్న సాయి శ్రీనివాస రెసిడెన్సీలో దిగారు. అక్కడి నుంచి నగరంలోని పలు షోరూంలలో మోడల్స్ చూపించి 3వ తేదీ రాత్రి 8.50 గంటలకు హోటల్‌కు చేరుకున్నారు. ఆభరణాలతో ఉన్న బ్యాగ్‌ను కబోర్డులో పెట్టి నిద్రించారు. 4వ తేదీ తెల్లవారుజాము 4.30 సమయంలో వంశీని లేపి వాకింగ్‌కు వెళ్తున్నట్లు జేజి చెప్పగా.. బయట నుంచి గదికి తాళం వేసి వెళ్లి రమ్మని వంశీ అన్నాడు. తర్వాత నిద్రలేచి చూసేసరికి జేజి కనిపించలేదు. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. కబోర్డు పరిశీలించగా అందులో ఉన్న ఆభరణాల బ్యాగు, జేజి వెంట తెచ్చుకున్న లగేజీ బ్యాగు కూడా కనిపించలేదు. ఈ విషయాన్ని వెంటనే హైదరాబాద్‌లోని షోరూం హెచ్‌ఆర్ సూరజ్‌కుమార్‌కు తెలిపాడు. హోటల్ సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా ఉదయం 4.30కు వాకింగ్‌కు వెళ్లిన జేజి మళ్లీ 5.47కు తిరిగి వచ్చి.. రెండు బ్యాగులను తీసుకెళ్లినట్లు తేలింది. ఈ ఘటనపై ద్వారకా పోలీస్‌స్టేషన్‌లో వంశీ ఫిర్యాదు చేశాడు.
మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా..
అప్పటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న ద్వారకా పోలీసులు.. మొబైల్ సిగ్నల్స్ ద్వారా శుక్రవారం రైల్వేస్టేషన్ పరిసరాల్లో జేజి ఉన్నట్లు గుర్తించారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అనుసరించారు. పోలీసులను చూసిన వారు పారిపోయేందుకు ప్రయత్నించగా.. వెంబండించి అదుపులోకి తీసుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో వారి బ్యాగును పరిశీలించి, విచారించగా.. వారు ముదపాక జేజి, ఆకుల సత్యనారాయణగా తేలింది. బ్యాగ్‌లో జేజి దొంగలించిన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. ఆకుల సత్యానారయణ జేజికి పార్టనర్. జేజి దొంగలించిన ఆభరణాలను ఆయన వద్దే ఉంచాడు. దీనిపై ఇంకా విచారణ జరుగుతున్నట్లు సీపీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన ద్వారకా సీఐ(ఇన్‌చార్జి) సీహెచ్ ఉమాకాంత్, సీఐ డీవీ రమణ, సబ్ ఇన్‌స్పెక్టర్లు జె.ధర్మేంద్ర, అసిరి తాత, హెడ్ కానిస్టేబుళ్లు వెంకటరమణ, కె.టి.వి.రమే్‌ష్, కానిస్టేబుళ్లు ఎం.నాగరాజు, ఎస్.రమేష్‌లను కమిషనర్ అభినందించారు.